YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు

  • లక్ష కోట్ల హార్టికల్చర్ ప్రకటనపై జగన్ తీవ్ర విమర్శలు
  • రైతు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారంటూ ఆరోపణలు
  • రాయలసీమలో ఎండిపోతున్న తోటలపై జగన్ ఆందోళన
  • కరువు నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్
Jagan

Jagan

రాయలసీమలో హార్టికల్చర్ రంగానికి రూ. లక్ష కోట్లు కేటాయిస్తున్నామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవన్నీ కేవలం అంకెల గారడీలు, పబ్లిసిటీ డ్రామాలు తప్ప మరొకటి కాదని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు. బడ్జెట్‌లో ఎలాంటి నిధుల కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రకటనలు గుప్పిస్తూ రైతులను మభ్యపెట్టడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పట్ల ఉన్న ప్రేమ కేవలం మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితమైందని దుయ్యబట్టారు.

రైతు సంక్షేమ పథకాల నిర్వీర్యం

రాష్ట్రంలో హార్టికల్చర్‌తో పాటు ఇతర పంటలకు మద్దతు ధరలు లేక రైతులు నిత్యం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం ఏరోజూ పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. గత తమ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ‘ధరల స్థిరీకరణ నిధి’ని నిర్వీర్యం చేయడమే కాకుండా, ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి రైతుల వెన్ను విరిచారని మండిపడ్డారు. సున్నా వడ్డీ రుణాల పథకాన్ని రద్దు చేసి, సమయానికి అందాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని పూర్తిగా పక్కనబెట్టేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో రైతుల కష్టసుఖాలను పట్టించుకోకుండా, కేవలం ప్రచార ఆర్భాటాలనే నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయలసీమలో కరువు సీన్.. తక్షణ సహాయక చర్యలకు డిమాండ్

ప్రస్తుతం తీవ్రమైన కరువు కారణంగా రాయలసీమ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్షం నెలకొందని, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్ తోటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క రాయలసీమలోనే దాదాపు 7 నుంచి 8 లక్షల బోర్లు ఎండిపోయాయని, రైతులు చెట్లను బతికించుకోవడానికి ట్యాంకర్ నీటి కోసం రూ. 1,500 నుండి రూ. 2,000 వరకు ఖర్చు చేస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారని వివరించారు. ఒకవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తూ, మరోవైపు ‘వాటర్‌మ్యాన్’ అని బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హార్టికల్చర్ హబ్ సంగతి దేవుడెరుగు కానీ, రాయలసీమతో సహా రాష్ట్రమంతా రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా ప్రచార ఆర్బాటాలు పక్కనబెట్టి, ఎండిపోతున్న తోటలను, రైతులను కాపాడేందుకు తక్షణమే కరువు నివారణా చర్యలు చేపట్టాలని జగన్ డిమాండ్ చేశారు.