NTV Telugu Site icon

YCP Vs TDP: CNOS ముఖ్యమంత్రుల పనితీరు ర్యాంకులపై మాటల యుద్ధం

Tdp Vs Ycp

Tdp Vs Ycp

కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలనపై దేశంలో ప్రముఖ సర్వే సంస్థ సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ ఒపీనియన్‌ సర్వే (సీఎన్‌ఓఎస్‌) భారీ సర్వే నిర్వహించింది. ప్రభుత్వ విధానాలు, పాలకుల పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయం సేకరించింది. సీఎన్‌వోఎస్‌ తాజా సర్వే ఫలితాల్లో ప్రధాని మోదీకి గతంలో కంటే ప్రజాదరణ కాస్త పెరిగింది. మోదీ నికర ఆమోదం రేటింగ్‌ 36 పాయింట్లుగా ఉంది. 54 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారు. 18 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా వారు తటస్థంగా ఉన్నారు. అటు ముఖ్యమంత్రుల పనితీరులో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. 70 శాతం ఒడిశా ప్రజలు నవీన్ పట్నాయక్ పాలనపై సంతృప్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

ఈ జాబితాలో రెండో స్థానంలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ నిలిచారు.మూడో స్థానంలో ఇటీవలే రాజీనామా చేసిన మహారాష్ట్ర తాజా ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఉన్నారు. నాలుగో స్థానంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఐదో స్థానంలో భగవంత్‌సింగ్‌ మాన్‌ నిలిచారు. తెలుగు రాష్ట్రాల సీఎంల విషయానికి వస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ 11వ స్థానంలో నిలిచారు. కేసీఆర్ నాయకత్వంపై 49 శాతం మంది తెలంగాణ ప్రజలు సంతృప్తితో ఉన్నట్లు సర్వే వివరించింది. 19 శాతం మంది ప్రజలు అసంతృప్తిగా ఉండగా 24 శాతం మంది తటస్థంగా ఉన్నారు. అటు ఏపీ సీఎం జగన్‌ ఈ జాబితాలో చివరి నుంచి ఆరోస్థానంలో నిలిచారు. 25 మంది సీఎంల పనితీరుపై సర్వే నిర్వహించగా జగన్‌కు 20వ ర్యాంక్ దక్కింది. సీఎం జగన్ పనితీరుపై 39 శాతం మంది ఏపీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. 32 శాతం మంది తటస్థంగా ఉన్నారు.

Read Also: Chandra Babu: కొండల్ని అక్రమంగా తవ్వేస్తున్న వారందరినీ బోనెక్కిస్తాం

అయితే ఈ సర్వేపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. ఏపీలో జగన్‌ గ్రాఫ్‌ తగ్గిందనడం విచిత్రంగా ఉందన్నారు. అట్టడుగుకు వెళ్తున్న తెలుగుదేశాన్ని కాపాడుకోడానికి టీడీపీ చేయించిన సర్వే ఇది అని ఆరోపించారు. ఆ సర్వే చేసిన సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ స్టడీస్‌ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్‌ శర్మదే అని.. వాళ్లు ఇలా కాక ఎలా రిపోర్టు ఇస్తారని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ ద్వారా టీడీపీ గ్రాఫ్‌ పెంచుకోవాలని చూశారని.. అది కుదరలేదని తెలిపారు. తండ్రీ కొడుకుల వల్ల టీడీపీ గ్రాఫ్‌ లేవడం లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ తర్వాత టీడీపీ పనైపోయిందని వాళ్లకు తెలిసిపోయిందన్నారు. దీంతో ఇలాంటి సర్వేలను తన జీతగాళ్లతో చేయించుకుని ఆనంద పడిపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ గ్రాఫ్‌ను ఎవరూ తగ్గించలేరని…వాళ్ల చేతకాదన్నారు. జగన్‌ ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని.. ఇలాంటి సర్వేలు ఏమీ చేయలేవన్నారు.

అటు సీఎన్‌వోఎస్ ర్యాంకుల గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తావించారు. ప్రజలకు జగన్ అంటే కంపరం పుట్టిందని.. అందుకే 20వ స్థానంలోకి వెళ్లారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా సర్వే చేస్తే టీడీపీ వాళ్లు చేయించారని అంటారా.. వైసీపీకి వ్యతిరేకంగా ఏం వచ్చినా వాళ్లంతా టీడీపీ వాళ్లు చేయించినట్టేనా అని ప్రశ్నించారు. వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని వేరేవరో చెప్పడం దేనికీ.. వాళ్లకే రిపోర్టులు వచ్చాయన్నారు. గడప గడపకు ఎత్తిపోయింది నిజం కాదా అని నిలదీశారు. అటవీ, మైనింగ్, రెవెన్యూ యంత్రాంగాలు సమాధానం చెప్పాలన్నారు. సమాజానికి చెడు చేసే వ్యక్తులతో తన పోరాటం అని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల కోసం తన యుద్ధమన్నారు. ఆస్తులు పోతే సంపాదిస్తాం.. కానీ సహజ సంపద పోతే తిరిగి రాదన్నారు. ప్రకృతి విలయతాండవం చేస్తే తట్టుకోలేం అని మరోసారి తాజాగా నిరూపణ అయిందన్నారు. సీఎం జగన్ సిమెంట్ కంపెనీ కోసం వేయి లారీలు రప్పిస్తారా.. మైనింగ్ మంత్రే అక్రమంగా కొండల్ని తవ్వేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తన అక్రమాలకు అడ్డం వస్తున్నందుకు తమ మీద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతోన్న అక్రమ తవ్వకాలపై సీఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 ప్రాంతాలకు పైగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.