Site icon NTV Telugu

President Election: ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన వైసీపీ

Ysrcp Droupadi Murmu

Ysrcp Droupadi Murmu

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తికావడంతో రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎన్డీఏ ప్రకటించింది. ఈనెల 24న శుక్రవారం నాడు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మూకు ఏపీలోని వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన మహిళకు ఇవ్వడం శుభ పరిణామం అని వైసీపీ పేర్కొంది. ముందుగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్ణయించుకున్నందున రేపు రాష్ట్రపతి నామినేషన్‌ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకావడం లేదని తెలిపింది. గడిచిన మూడేళ్ళుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్ద పీట వేస్తున్న పార్టీగా ద్రౌపది ముర్మూకి మద్దతు తెలుపుతున్నట్లు వైసీపీ వివరించింది. అయితే శుక్రవారం నాడు ద్రౌపది ముర్ము నామినేషన్‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత హాజరవుతారని తెలియజేసింది.

కాగా రాష్ట్రప‌తి అభ్యర్థిగా పోటీ చేయాల‌నుకునే అభ్యర్థుల‌ను రాష్ట్రప‌తి ఎన్నికల్లో ఓటు హ‌క్కు క‌లిగిన 50 మంది ప్రతిపాదిస్తే… మ‌రో 50 మంది బ‌ల‌ప‌ర‌చాల్సి ఉంది. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము నామినేష‌న్‌కు బీజేపీ ఇప్పటికే స‌న్నాహాలు పూర్తి చేసింది. ద్రౌప‌ది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే వారి జాబితాలో ఏపీకి చెందిన బీజేపీ రాజ్యస‌భ ఎంపీ సీఎం ర‌మేష్‌కు కూడా చోటు ద‌క్కింది. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేర‌కు ద్రౌప‌ది ముర్మును ఎన్డీఏ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ గురువార‌మే సీఎం ర‌మేష్ ప్రతిపాద‌న ప‌త్రంపై సంత‌కం చేశారు. ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే అవ‌కాశం ద‌క్కిన నేత‌ల్లో ఏపీ నుంచి సీఎం ర‌మేష్ ఒక్కరే ఉన్నారు. ఈ విష‌యాన్ని స్వయంగా సీఎం ర‌మేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

 

Exit mobile version