వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. నెలరోజులుగా టీడీపీ పనికిమాలిన చర్చ పెట్టిందని.. అదాన్ అనే కంపెనీ తనదేనని దుష్ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చెప్పిన అబద్ధం మళ్లీ మళ్లీ చెప్తే నిజమై పోతుందని టీడీపీ నమ్మకమని ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తన అల్లుడు కంపెనీకి చెందినవాడని ఆరోపిస్తున్నారని.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విదాన్ అటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వడ్లమూడి నాగరాజు అనే వ్యక్తి కియా మోటార్స్ డీలర్ ఇచ్చారని.. ఇదే నాగరాజు హెరిటేజ్ కంపెనీల్లో డైరెక్టర్‌గా కూడా ఉన్నాడని విజయసాయిరెడ్డి అన్నారు.
శ్రీనివాస్ ఎలాగైతే వేరే కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నాడో అదే నాగరాజుకు అప్లై కాదా అని ప్రశ్నించారు. నంద్యాల విష్ణురాజు హెరిటేజ్, అమరరాజా బ్యాటరీస్‌లోనూ డైరెక్టర్ అని గుర్తుచేశారు. మరి అమరరాజా కంపెనీ చంద్రబాబుదే అని తాను అంటే ఎలా ఉంటుందని నిలదీశారు. లివ్ లైఫ్ హాస్పిటల్స్, ఎక్సెల్ కంపెనీల్లో హెరిటేజ్ కంపెనీలో కామన్ డైరెక్టర్స్ ఉన్నారని.. మరి అవి చంద్రబాబువి అని అనవచ్చా అని విజయసాయిరెడ్డి అన్నారు.
దివీస్ సంస్థ వ్యక్తులు తనకు క్లోజ్ ఫ్రెండ్స్.. నారా ఫ్యామిలీకి క్లోజ్ అని.. అలాగని దివీస్ తనది అయిపోతుందా అన్నారు. అదాన్ కంపెనీ 3 శాతం మద్యాన్ని మాత్రమే సప్లై చేస్తోందని.. రాజకీయంగా ఎదుర్కోలేక లేని పోని ఆరోపణలు చేయవద్దని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. టీడీపీ నేతలు చేసే దుష్ప్రచారానికి పదింతలు ఎక్కువగా తాను కూడా చేయగలనని… పరిధులు దాటవద్దని చంద్రబాబు, లోకేష్‌కు వార్నింగ్ ఇస్తున్నానని తెలిపారు. టీడీపీ నేతలు వాడే అసభ్య పదజాలం తాము కూడా వాడగలమన్నారు. ఆకాశంపైకి ఉమ్మేస్తే అది చంద్రబాబు మీదే పడుతుందని గ్రహించాలన్నారు.
వేలకోట్ల ఎగ్గొట్టిన క్వారీ ప్రమోటర్లు ఎవరో చంద్రబాబు చెప్పాలని..వాళ్లు ఆయన భాగస్వామ్యులు కాదా అని ప్రశ్నించారు. హెరిటేజ్ కంపెనీలో డైరెక్టర్ ముత్తురాజు విజయకుమార్ సత్యం కంపెనీలో డైరెక్టర్ కాదా అని నిలదీశారు. తన బంధువుల కంపెనీలన్నీ తనవే అయితే హెరిటేజ్ కూడా తనదే అవుతుందన్నారు. చంద్రబాబు కూడా తనకు బంధువే అని.. అన్న వరుస అవుతాడని.. తారకరత్న ద్వారా తనకు చంద్రబాబు సోదరుడు అవుతాడని వివరించారు. అలాగని ఆయన ఆస్తులన్నీ తనవి అయిపోతాయా అని సూటి ప్రశ్న వేశారు. నారా బ్రాహ్మణి 16 కంపెనీల్లో డైరెక్టర్.. భువనేశ్వరి 14 కంపెనీల్లో డైరెక్టర్ అని.. చంద్రబాబు చెప్పే లాజిక్ కరెక్ట్ అయితే తనకు ఆపాదించే ఆరోపణను కూడా అంగీకరిస్తానన్నారు. ఆ కంపెనీలన్నీ ఎర్రమంజిల్‌లోని ఒకే చిరునామాతో ఉన్నాయని.. కామన్ డైరెక్టరుగా ఉంటే ఆ కంపెనీ మీది అయిపోతుందా అని నిలదీశారు.
క్రూయిజ్ కంపెనీ ఓనర్ షిప్ తమది అని చంద్రబాబుకి ఒక్కడికే తెలిసిందని.. అది నిజంగా తమదైతే ఆయనకు ఉచితంగా రాసిస్తానని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. మద్యం శాంపిల్స్ టెస్టుకి పంపామని.. హెరిటేజ్ పాలు కూడా శాంపిల్ తీసి టెస్టుకు పంపామని.. రిపోర్ట్స్ వస్తాయని.. అప్పుడు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం ప్రైవేట్ పరం అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు కల వచ్చిందేమో అని చురకలు అంటించారు. ఇటీవల సీఎం ర్యాంకులపై సర్వే చేసిన కంపెనీ ఎవరిది.. రాబిన్ శర్మదేగా అని సూటిగా ప్రశ్నించారు. ఆ కంపెనీకి క్రెడిబులిటీ ఎక్కడ ఉంటుందన్నారు. ఏపీలో పాడైన రోడ్ల విషయంలో నిధులు ఇచ్చారని.. ఎక్కడా నిర్లక్ష్యం ఉండదని.. పనులు ముందుకు సాగతాయని స్పష్టం చేశారు. ఒక ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిత్వం ఇచ్చారు కాబట్టే తాము మద్దతు పలికామని విజయసాయిరెడ్డి అన్నారు. దానికి ఎన్డీఏకి లింక్ చేయాల్సిన అవసరం లేదన్నారు. గతంలో రామ్‌నాథ్ కోవింద్ కూడా ఎస్సీ కావడంతో మద్దతిచ్చినట్లు గుర్తుచేశారు.
