Site icon NTV Telugu

YCP MLA Dharmana: చట్టాలు చేసే అధికారం న్యాయవ్యవస్థకు లేదు

ఏపీ అసెంబ్లీలో పాలన వికేంద్రీకరణ అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చర్చ ప్రారంభించారు. చట్టాలు చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను సీఎం జగన్‌కు లేఖ రాసిన విషయాన్ని ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించానని చెప్పారు. దీనిపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఎందైనా ఉందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఒక వ్యవస్థను ఇంకో వ్యవస్థ పలచన చేస్తుంటే ఇది పరువు తీసుకోవడమే కాకుండా తగని పని అని మాజీ మంత్రి ధర్మాన వెల్లడించారు. శాసనాలు చేసే అధికారం అసెంబ్లీ, పార్లమెంట్‌కు తప్ప వేరే వాళ్లకు లేదన్నారు. రాజ్యాంగ వ్యతిరేకమైన సందర్భంలో మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం మారితే విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని న్యాయవ్యవస్థ ఎలా చెప్తుందని ప్రశ్నించారు. ప్రజలు తీర్పు ఇచ్చారంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నచ్చలేదనే అర్థం కదా అని అభిప్రాయపడ్డారు. కొత్త విధానాలు చేయాలన్నదే ప్రజల ఉద్దేశం కదా అన్నారు. ఆ అధికారం లేదని కోర్టులు చెప్తే ఏం చేయాలని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. ఈ మూడు వ్యవస్థల్లో ప్రజాభిప్రాయాన్ని తెలిపేది కేవలం శాసన వ్యవస్థ మాత్రమే అని ధర్మాన స్పష్టం చేశారు.

Exit mobile version