జూలై 8, 9 తేదీల్లో నిర్వహించే వైసీపీ ప్లీనరీకి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో గ్రౌండ్‌ను వైసీపీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మండలి చీఫ్ విప్, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వైసీపీ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని.. పార్టీ నేతలందరూ ఏం చేయాలి, విధి విధానాలు ఎలా ఉండాలి అన్న చర్చ ప్లీనరీలో జరుగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో జరిగే కార్యక్రమాలకు సంబంధించి ప్లీనరీ తీర్మానాలు ఉంటాయన్నారు. పార్టీలో వివిధ వర్గాల అభిప్రాయం చెప్పే వేదిక ప్లీనరీ అని ఉమ్మారెడ్డి వివరించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్నవి అమలు చేశామని స్పష్టంగా ప్లీనరీలో చెప్తామన్నారు. ప్లీనరీకి గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ హాజరవుతారని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఇందులో వేరే ఆలోచన అవసరం లేదన్నారు. శాశ్వత అధ్యక్షుడు అనే సవరణ చేస్తే విజయమ్మ కూడా శాశ్వత గౌరవ అధ్యక్షురాలు అవుతారని తెలిపారు. ఈ అంశం పై సీఎం జగన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ప్లీనరీలో ప్రజల ఆశలకు, గత మూడేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మధ్య ఏమైనా గ్యాప్ ఉందా అనేది చర్చిస్తామని ఉమ్మారెడ్డి చెప్పారు. మార్పులు అవసరమైతే తీసుకోవటానికి వెనకడుగు వేయమన్నారు. ప్లీనరీలో 15 వరకు తీర్మానాలు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని.. రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందన్నారు.
Read Also: Governor TamiliSai: అప్పటి వరకు ఆగకండి.. వయసు ఉన్నప్పుడే పెళ్లిచేసుకోండి
అటు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 2017లో ప్లీనరీ నిర్వహించామని.. జూలై 8, 9 తేదీలకు ఒక ప్రాధాన్యత ఉందని తెలిపారు. 2027లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఘనంగా ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. కిక్ బాబు ఔట్… అండ్ సర్వ్ ద పీపుల్ తమ నినాదం అని.. వచ్చే ఎన్నికల్లో ఈ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్లీనరీకి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారని.. అధ్యక్షుడి ఉపన్యాసంతో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అవుతాయన్నారు. పలు తీర్మానాలు, సవరణలను ప్లీనరీ ప్రతిపాదిస్తుందని తెలిపారు.
ఐదేళ్ళ కిందట చారిత్రాత్మక ప్లీనరీని ఇదే ప్రాంతంలో నిర్వహించామని.. ఇప్పుడు నిర్వహించే ప్లీనరీలో భవిష్యత్ చిత్ర పటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇది కేవలం పార్టీకి సంబంధించిన ప్లీనరీ మాత్రమే కాదన్నారు. ప్రజల ఎజెండాతో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై సమగ్ర చర్చ ఉంటుందని తెలియజేశారు. వార్డు స్థాయిలో పోటీ చేసిన వ్యక్తికి సైతం సీఎం జగన్ స్వయంగా చేసిన సంతకంతో ఆహ్వాన లేఖను అందిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. ఇది కూడా ఒక ఆహ్వానంగా అందరూ భావించి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మీడియా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.