Site icon NTV Telugu

పక్క రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత పీఆర్సీ ఇవ్వడం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి స్పందించారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు దిగజారినా.. ఉద్యోగులు అడగ్గపోయినా సీఎం 27 శాతం ఐఆర్ ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐఆర్ ఇచ్చి ఉండకపోతే ప్రభుత్వం రూ.18వేల కోట్ల భారం పడి ఉండేది కాదన్నారు. ఐఆర్ ఇవ్వకుండా ఉంటే పెండింగ్‌లో ఉన్న చిన్న కాంట్రాక్టు బిల్లులన్నీ ప్రభుత్వం చెల్లించి ఉండేదన్నారు. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా చూస్తున్నామని… ఉద్యోగులను నష్టపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు.

Read Also: వైసీపీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వం: సోము వీర్రాజు

ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూసి, కించపరిచిన వారిని గత ప్రభుత్వంలో చూశామని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బహిరంగ వేదికలపై ప్రభుత్వ ఉద్యోగులను అవమానించిన పరిస్థితి గతంలో ఉండేదన్నారు. ద్వేషించే వారి ట్రాప్‌లో ఉద్యోగులు పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. హెచ్ఆర్ఏపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందన్నారు. దీనిపై ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని.. ఇప్పటికే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచినట్లు గుర్తుచేశారు. ఉద్యోగులు పునరాలోచన చేయాలని.. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా వ్యవహరించదన్నారు. ప్రభుత్వంపై పదివేల కోట్ల భారం పడుతున్నా 23శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామన్నారు. ఉద్యోగులు పీఆర్సీపై తెలంగాణతో పోల్చి చూసుకోవాలని సూచించారు. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత పీఆర్సీ లేదన్నారు. ఉద్యోగులు తమ వైపు నుంచే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా చూడాలన్నారు. ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీల్లాగా ఆలోచించవద్దని హితవు పలికారు. ఉద్యోగులను చర్చలకు పిలిచి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Exit mobile version