ఏపీలో ఇటీవల ఖాళీ అయిన ఓ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మహ్మద్ కరీమున్నిసా మరణించగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇటీవలే ఈసీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా కరీమున్నిసా కుమారుడు రుహుల్లా నామినేషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు గురువారం నాడు పార్టీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వెంట రాగా.. అమరావతిలోని శాసనసభ సెక్రటేరియట్‌లో రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డికి రుహుల్లా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాగా శాసన సభలో పార్టీల బలాబలాలు చూసుకుంటే రుహుల్లా విజయం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. రుహుల్లా ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
కాగా మహ్మద్ రుహుల్లా బుధవారం నాడు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి బీ ఫామ్ అందుకున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పట్ల సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌కు మైనారిటీలు ఎప్పటికి రుణ పడి ఉంటారన్నారు. తామంతా ఆయనకు అండగా ఉండి ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు. తన తల్లి కరీమున్నిసా చేసిన అభివృద్ధిని కొనసాగిస్తానని రుహుల్లా తెలిపారు.
