ఒక్క జిల్లా.. రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. ఐదుగురు మంత్రులు. ఇది అధికారపార్టీ రచించిన పంచతంత్రం. ఎందుకు అక్కడంత ప్రత్యేకత? స్పెషల్ ఫోకస్ వెనక కారణం.. రెబల్ అభ్యర్థికి చెక్ పెట్టడమేనా?
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేదెవరు?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుచోట్ల ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారపార్టీ నుంచి స్పెషల్ క్యాంపులు జోరు పెరిగింది. పోలింగ్ జరిగే ఆరింటిలో కరీంనగర్‌లో జరిగే రెండు స్థానాలపైనే పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ జిల్లాలో మొత్తం 8 వందలకు పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎల్. రమణ, భాను ప్రసాదరావు బరిలో ఉంటే.. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ గెలిచేదెవరు? ఎవరికి మూడింది అనే చర్చ జరుగుతోంది.
హైదరాబాద్ టు బెంగళూరు.. ఆపై ఏపీలో క్యాంపులు..!
ఎన్నికల పర్యవేక్షణ చేస్తోన్న ఐదుగురు మంత్రులు
రవీందర్‌సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా వెనక్కి తగ్గకపోవడంతో టీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించింది. ముందుగా హైదరాబాద్.. ఆ తర్వాత బెంగళూరు.. ఆపై ఆంధ్రప్రదేశ్‌లో క్యాంపులు పూర్తి చేసుకుని తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారట. అయితే కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛాన్స్ తీసుకోకుండా పోలింగ్‌కు పక్కా వ్యూహం సిద్ధం చేసింది టీఆర్ఎస్. అక్కడి ఎన్నిక కోసం పలువురు మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లు క్యాంపులను పర్యవేక్షిస్తున్నారు. వీరిద్దరూ కాకుండా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు సైతం ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల పనిపైనే ఉన్నారట.
నేరుగా పోలింగ్ రోజునే కరీంనగర్ తీసుకొస్తారా?
ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను క్యాంపుల్లో జాగ్రత్తగా చూసుకుంటున్నారట. ఈ క్యాంపుల్లోనే మాక్ పోలింగ్‌పై అవగాహన కల్పిస్తున్నట్టు సమాచారం. క్యాంపుల నుంచి తిరిగి రాగానే వారికి మరోసారి ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది. వీరందరినీ పోలింగ్‌కు ఒకరోజు ముందు కానీ.. లేదా పోలింగ్ రోజున నేరుగా కరీంనగర్ తీసుకెళ్లే ఆలోచనలో నాయకులు ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల వాదన. అయితే ఈ ఎన్నిక కోసం ఏకంగా ఐదుగురు మంత్రులు పార్టీ పర్యవేక్షకులుగా రావడం ఆసక్తి కలిగిస్తోంది. వీరు కాకుండా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇదే పనిలో ఉన్నారట. వారి నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎటూ జారిపోకుండా చూసుకుంటున్నారట. మరి.. పోలింగ్ నాటికి ఈ పంచతంత్రం ఐదుగురితో సరిపెడతారో.. ఇంకా మరికొందరు మంత్రులను రంగంలోకి దించుతారో చూడాలి.
