AP Panchayat Elections: రసవత్తరంగా పంచాయతీ పోరు.. ఏకగ్రీవం చేస్తే ఎకరం పొలం.. రూ.50 లక్షల ఆఫర్!

East Thalluru Village

East Thalluru Village

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల హడావిడి కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసిపోగా.. ఇక పంచాయతీ ఎన్నికలకు నిర్వహించేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది.. అయితే, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది. సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే గ్రామానికి భారీగా నిధులు, ఆస్తులు ఇస్తామంటూ అభ్యర్థులు ముందుకు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఒక అభ్యర్థి ఏకంగా రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించగా.. మరో అభ్యర్థి ఎకరం పొలం ఇస్తానని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామ పంచాయతీ ఎన్నిక ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. సర్పంచ్ పదవి కోసం పలువురు అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఎన్నికలు జరిగితే లక్షల రూపాయలు ఖర్చవడమే కాకుండా, గ్రామంలో ఇప్పటివరకు కొనసాగుతున్న ఐక్యత దెబ్బతింటుందని గ్రామ పెద్దలు భావించారు. దీంతో ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఇటీవల పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో చర్చలు జరిపారు. ఎన్నికల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం, గ్రామంలో వర్గ విభేదాలు పెంచుకోవడం కంటే అందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఏకగ్రీవానికి సహకరించే అభ్యర్థులు గ్రామ అభివృద్ధికి ఎంతమేరకు సహకరిస్తారు? గ్రామంలోని ఆలయాలు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలకు ఏమి చేస్తారు? అని పెద్దలు అభ్యర్థులను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఒక అభ్యర్థి గ్రామానికి రూ.50 లక్షలు ఇస్తానని ముందుకు వచ్చినట్లు సమాచారం. మరో అభ్యర్థి ఏకంగా ఎకరం పొలం ఇస్తానని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో తూర్పుతాళ్లు పంచాయతీ ఎన్నికల వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులు గ్రామానికి ఇచ్చే హామీలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని గ్రామ పెద్దలు భావిస్తున్నారు. ఎవరైనా నామినేషన్ దాఖలు చేసినా వారితో మాట్లాడి ఉపసంహరించుకునేలా ప్రయత్నించాలని నిర్ణయించారు. ఏకాభిప్రాయం కుదరకపోతే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా భావిస్తున్నారు. ఈసారి తూర్పుతాళ్లు పంచాయతీ సర్పంచ్ పదవి ఓసీ జనరల్‌కు కేటాయించారు. కూటమి పార్టీలకు మద్దతుగా ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం ముగ్గురు అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం కొనసాగాలని, ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతో పెద్దలు చేస్తున్న ఏకగ్రీవ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.