Botsa Satyanarayana: పంట నష్టంపై వైసీపీ నేత, మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బొత్స.. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన స్థాయిలో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. హెక్టారుకు రూ.25 వేల పరిహారం ఇస్తామని చెప్పడం సరిపోదని, పంటను బట్టి నష్టపరిహారం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బొప్పాయి, అరటి వంటి పంటలకు ఎకరాకు రూ.లక్ష వరకు, ఇతర పంటలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బొత్స పేర్కొన్నారు. ప్రస్తుతం పరిహారం ఇవ్వకపోయినా భవిష్యత్‌లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు.
ఇటీవల ఎమ్మెల్యే వచ్చి వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారని, జిల్లాలో సుమారు రూ.10 కోట్ల నష్టం జరిగినట్లు వెల్లడించారని బొత్స తెలిపారు. ప్రభుత్వం అదే స్థాయిలోనైనా రైతులకు సాయం అందించాలని కోరారు. జిల్లాలో సుమారు 360 హెక్టార్లలో వరి, 40 హెక్టార్లలో పత్తి పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. మరో 20 హెక్టార్లలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వర్షాల కారణంగా ప్రజలు మూడు రోజుల పాటు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రభుత్వ యంత్రాంగం వారికి తాగునీరు కూడా అందించలేకపోయిందని విమర్శించారు.
గతంలో పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించేదని, ఇప్పుడు రైతులే చెల్లించుకోవాలని చెబుతున్నారని బొత్స అన్నారు. పంట బీమా విషయంలో సరైన మానిటరింగ్ లేదని ఆరోపించారు. పెద్దలకు వందలు, వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇస్తున్నారని, రైతులకు మాత్రం తగిన ప్రయోజనం దక్కడం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రైతులకు 30 శాతం మేర మాత్రమే పంట అందుబాటులో ఉందని, అయినప్పటికీ అవసరమైన ఎరువులు కూడా సక్రమంగా లభించడం లేదని బొత్స తెలిపారు. పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలో ఎరువులు పుష్కలంగా లభిస్తున్నాయని, ఇక్కడ మాత్రం రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత, మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ..

