Vizianagaram: విజయనగరం జిల్లాలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. జంఝావతి, తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్, ఆండ్ర, గడిగెడ్డ, తాటిపూడి జలాశయాల కింద దాదాపు 40 వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఇక, గంట్యాడ మండలం తాటిపూడి గ్రామం దగ్గర గోస్తనీ నదిపై జలాశయం నిర్మించారు. 1965- 1968 మధ్య కాలంలో 1.85 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3.17 టీఎంసీలు. ఈ జలాశయం 650 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని గరిష్ఠ నీటిమట్టం 297 అడుగులుగా ఉంది. దీని ద్వారా గంట్యాడ, జామి, ఎస్.కోట మండలాల్లో 15,366 ఎకరాలకు సాగు నీరు, విశాఖపట్నానికి రెండు టీఎంసీల తాగు నీరు అందుతోంది. ఈ జలాశయ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఆధునీకరణ పనులు చేపట్టక పోవడంతో సాగునీటి కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
Read Also: Fake Notes: దేశంలో చెలామణి అవుతున్న నకిలీ కరెన్సీ రూ. 500 నోటు
అయితే, ఇప్పుడు ఈ తాటిపూడి ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు జపాన్ నిధులు రూ.24.92 కోట్లు మంజూరు అయ్యాయి. టెండర్లు ప్రక్రియ పూర్తయ్యాక పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ జలాశయం నుంచి విశాఖ నగరానికి ప్రతి రోజు 11 మిలియన్ గ్యాలన్ల నీరు అందిస్తుండగా విజయనగరం ప్రజల దాహార్తి తీర్చడానికి జలాశయం దిగువన ఏటిలో భూగర్భ జలాలను ముషిడిపిల్లి పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు. రిజర్వాయర్ కు ఎగువన కురుస్తున్న వర్షాలకి పూర్తిగా నిండుకుంది. వర్షాల కొనసాగడంతో మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Read Also: Harassment: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. గళ్లపట్టి పీఎస్ కు లాక్కెళ్లిన మహిళ
ఇక, తాటిపూడి రిజర్వాయర్ కు ఉన్న నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఈ నీటి ప్రవాహం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దిగువన విజయనగరం నుంచి శృంగవరపుకోటకు వెళ్లే మార్గం నుంచి ఈ ప్రాజెక్టును జనం తిలకిస్తున్నారు. అలాగే, రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తోంది. చుట్టూ కొండలపై పచ్చని సుందరమైన దృశ్యాలు డ్రోన్లతో పర్యాటకులు చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ప్రకృతి రమణీయాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు.