S.Kota Sub Registrar Suspended: రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా విజయనరంలో విస్తృత పర్యటన అనంతరం చర్యలు మొదలయ్యాయి. శృంగవరపుకోట సబ్ రిజిస్ట్రార్ ని సస్పెండ్ చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట.. ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్ శ్యామలను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలు, నిషేధిత భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని కొందరు ఫిర్యాదు అందాయి. ఇటీవల రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా. ఎస్. కోట లోని రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి పలు దస్త్రాలను పరిశీలించారు. పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ వేటు వేశారు.. దీంతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులలో గుబులు మొదలైంది. ఎవ్వరిపై వేటు పడుతుందోనని ఉద్యోగులలో ఆందోళన మొదలైంది.
అయితే, ఆర్‌పీ సిసోడియా గతవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. భోగాపురం, ఎస్.కోట, వేపాడ మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పరిస్థితులను అంచనా వేశారు. భూరికార్డులను పరిశీలించి భూముల వర్గీకరణపై వివిధ ప్రభుత్వ శాఖల వద్ద రికార్డుల్లో తేడాలు వుండటాన్ని గుర్తించారు. జిల్లా కేంద్రంలో ఆర్.డి.ఓ.లు, తహశీల్దార్‌లు, సబ్ రిజిస్ట్రార్లతో సమావేశమై 22ఏ కేటగిరీ భూములు, ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్, భూముల రీసర్వే అనంతరం తలెత్తిన పరిస్థితులు, గృహనిర్మాణానికి అవసరమైన భూముల గుర్తింపు తదితర అంశాలపై సూచనలు చేశారు. భూముల వర్గీకరణ విషయంలో రానున్న రోజుల్లో తహశీల్దార్ వద్ద, రిజిష్ట్రార్‌ల వద్ద రికార్డులు ఒకేలా నమోదై వుండాలని స్పష్టంచేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి భూ సమస్యలపై వినతులు స్వీకరించారు. భోగాపురంలో తహశీల్దార్ కార్యాలయం, సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలను సందర్శించి భూములకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు.
ఇక బసవపాలెం చేరుకొని అక్కడ గ్రామస్థులతో మాట్లాడి భూసర్వే జరిగిన తీరుపై ఆరా తీశారు. భూముల సర్వే పూర్తయిన తర్వాత పట్టాదారు పాస్‌పుస్తకాలు ఎవరికైనా అందాయా, భూహక్కు పత్రాలు ఇచ్చారా లేదా అనే అంశంపై మాట్లాడారు. ఎవరివద్దయినా పాస్‌పుస్తకాలు వుంటే చూపించాలని కోరారు. గ్రామంలోని రెవిన్యూ రికార్డుల్లో వున్న పలువురు భూయజమానుల పేర్లు చదివి వినిపించి వారి భూముల్లో ఎవరు సాగు చేస్తున్నారు, ఏయే పంటలు సాగు చేస్తున్నారని ఆరా తీశారు. గ్రామంలోని భూరికార్డులను పరిశీలించారు. జిల్లా కేంద్రానికి చేరుకొని కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్‌లు, సబ్ రిజిష్ట్రార్‌లతో సమావేశమై పలు అంశాలపై సూచనలు చేశారు. ఇలా రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా పర్యటన ముగిసిన తర్వాత చర్యలకు దిగుతున్నారు అధికారులు.. ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్ శ్యామలను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
