Bhogapuram International Airport: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అలూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు భోగాపురం చేరుకుని ఈ ప్రతిష్ఠాత్మక విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన మినిట్-టు-మినిట్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మొత్తం పర్యటన సుమారు రెండు గంటల 25 నిమిషాల పాటు కొనసాగనుంది.
ప్రధాని పర్యటన నేపథ్యంలో భోగాపురం పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భూమిపైనే కాకుండా సముద్ర మార్గంలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భోగాపురం మండలం చింతపల్లి మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 29 కిలోమీటర్ల తీర ప్రాంతంలో నిరంతర నిఘా కొనసాగుతోంది. సోనా బోట్‌తో పాటు అవసరమైన చోట నాటుపడవలను వినియోగిస్తూ సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నారు. తీరానికి రెండు నాటికల్ మైళ్ల వరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 60 మంది మెరైన్ పోలీసు సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తూ అనుమానాస్పద పడవలు, అక్రమ రవాణా, ఇతర కదలికలపై నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూల్
* ఉదయం 10:45 గంటలకు: దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం అలూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
* ఉదయం 10:45 నుంచి 10:50 గంటల వరకు: విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు.
* ఉదయం 10:50 నుంచి 10:55 గంటల వరకు: ఎయిర్‌పోర్ట్ రన్‌వే నుంచి కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు.
* ఉదయం 10:55 నుంచి 10:58 గంటల వరకు: టెర్మినల్ వద్ద 200 మంది విద్యార్థులు ప్రదర్శించే సాంప్రదాయ కూచిపూడి నృత్య రూపకంతో ప్రధానికి ప్రత్యేక స్వాగతం పలకనున్నారు.
* ఉదయం 11:00 నుంచి 11:15 గంటల వరకు: రికార్డు సమయంలో పూర్తయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులను ప్రధాని స్వయంగా పరిశీలిస్తారు.
* ఉదయం 11:17 నుంచి 11:25 గంటల వరకు: టెర్మినల్ భవనం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్‌టాప్ జీప్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.
* ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:55 గంటల వరకు: అలూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అధికారికంగా జాతికి అంకితం చేస్తారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
* మధ్యాహ్నం 1:05 నుంచి 1:10 గంటల వరకు: కార్యక్రమం ముగిసిన అనంతరం భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, పర్యాటకం, ఐటీ, లాజిస్టిక్స్, ఉపాధి రంగాలకు కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా మారనుందని అధికార యంత్రాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

