Botsa Anusha: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తన రాజకీయ వారసురాలిపై కీలక ప్రకటన చేశారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో తన కుమార్తె బొత్స అనూష రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో బొత్స అనూష బరిలో నిలవనున్నట్లు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఆమె పోటీ చేయనున్నట్లు తెలిపారు. దీంతో బొత్స కుటుంబం నుంచి మరో తరం రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు స్పష్టమైంది.
అయితే, బొత్స అనూష వైద్య విద్యను అభ్యసించారు. డాక్టర్‌గా విద్యార్హత పొందిన ఆమె.. ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా జీవితంలో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు ఆమె రాజకీయ అరంగేట్రానికి వేదిక కానున్నాయి. ఇక, బొత్స సత్యనారాయణ ప్రకటనతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో అనూష పోటీపై ఆసక్తి నెలకొంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఆమె బరిలోకి దిగనుండటంతో రాబోయే ఎన్నికల్లో ఈ పోటీ కీలకంగా మారే అవకాశం ఉంది.
కాగా, ఉమ్మడి ఏపీతో పాటు.. నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ సీనియర్ నేతగా ఉన్నారు బొత్స సత్యనారాయణ.. ఉమ్మడి ఏపీలో మంత్రిగా.. పీసీసీ చీఫ్‌గా పనిచేసిన ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా.. నవ్యాంధ్రలో వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ మంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సేవలు అందించారు.. ఉత్తరాంధ్ర రాజకీయాలను ప్రభావితం చేసిన నేతల్లో ఒకరిగా.. కీలకంగా ఎదిగారు బొత్స.. ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఇక బొత్స కుటుంబానికి రాజకీయాలు కొత్తకాదు.. విజయనగరం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బొత్స కుటుంబానికి ఇప్పటికీ బలమైన పట్టు ఉందని చెబుతారు.. ఆయన భార్య బొత్స ఝాన్సీ కూడా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు.. ఇప్పుడు తల్లిదండ్రుల వారసత్వం అందిపుచ్చుకుని బొత్స అనూష.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు.. ఈ మధ్య పార్టీ కార్యక్రమాలు.. ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వచ్చారు.. అప్పటి నుంచే ఆమె పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరగగా.. మొత్తానికి ఇప్పుడు బొత్స అనూష.. రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చేశారు బొత్స సత్యనారాయణ..

