23 Indian Fishermen Released: బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులకు విముక్తి లభించింది.. ఉత్తరాంధ్రకు చెందిన 9 మందికి విడుదలతో ఆ కుటుంబాల్లో ఆనందం నెలకొంది.. బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వశాఖ 23 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసింది. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 14 మంది మత్స్యకారులు ఉన్నారు.
Read Also: Global Firepower Ranking: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు.. పడిపోయిన పాక్ సైన్యం ర్యాంక్..
బాగర్హాట్ (Bhagerhat) జైల్లో నిర్బంధంలో ఉన్న ఈ మత్స్యకారులను విడుదల చేసిన అనంతరం, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మోంగ్లా పోర్టుకు తరలించారు. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకున్న బోటుకు మరమ్మతులు పూర్తయ్యాక, రేపు వీరంతా బోటు ద్వారా తిరుగు ప్రయాణం కానున్నారు. అయితే, గత ఏడాది అక్టోబర్ నెలలో పశ్చిమ బెంగాల్ తీరంలో వేట సాగిస్తున్న సమయంలో, అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించడంతో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ మత్స్యకారులను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి వీరు జైలులోనే గడుపుతున్నారు. విడుదల వార్తతో ఉత్తరాంధ్ర మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ వారి రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. భారత ప్రభుత్వ జోక్యం, ద్వైపాక్షిక చర్చల వల్లే ఈ విముక్తి సాధ్యమైందని వారు భావోద్వేగంగా చెప్పారు.