NTV Telugu Site icon

Vishnu Vardhan Reddy: అల్లూరి జయంతి సభను రాజకీయ కోణంలో చూడొద్దు

Vishnu Vardhan Reddy

Vishnu Vardhan Reddy

జూలై 4న భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి జనసేన పార్టీని ఆహ్వానించలేదని వస్తున్న విమర్శలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి ప్రత్యేకంగా జనసేనను ఆహ్వానించాల్సిన అవసరం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. బీజేపీ-జనసేన ఒక్కటేనని.. పవన్ తమ ఇంట్లో అతిథిలాంటి వాడని విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భీమవరంలో అల్లూరి జయంతి సభను రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. మోదీ సభకు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 20 వేల మంది వస్తారని ఆయన తెలిపారు. జన సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని పేర్కొన్నారు. అల్లూరి విగ్రహాన్ని రూ.3 కోట్లతో భారత ప్రభుత్వం తయారు చేయించిందని వివరించారు.

Read Also: Tirumala Assets: శ్రీవారి ఆస్తుల విలువెంత? రక్షించే నాథుడెవరు?

అల్లూరి విగ్రహావిష్కరణకు అన్ని రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పలికినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ప్రధాని తెలంగాణలో పర్యటిస్తుంటే చిల్లర రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని కూడా పిలిచామన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణను కూడా కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారని.. ప్రధానికి ఆహ్వానం పలకకపోవడం కేసీఆర్ దొరతనానికి నిదర్శనమన్నారు. గతంలో ప్రధాని గురించి హోర్డింగులు కట్టిన వాళ్లు ఏమయ్యారో చరిత్రలో చూడవచ్చని చురకలు అంటించారు. రాష్ట్రాభివృద్ధిపై కేసీఆర్‌కు ప్రేమ ఉంటే మోదీతో చర్చించాలన్నారు. తెలంగాణలో ఆత్మహత్యల గురించి కేసీఆర్ ఆలోచించాలని హితవు పలికారు.ప్రధాని వస్తుంటే పోటీగా టూ వీలర్ ర్యాలీలు పెట్టడం సిగ్గుచేటు అని విమర్శించారు. కేసీఆర్ అడుగు పెట్టాక మహారాష్ట్ర ఏమైందో అందరికీ కనిపించిందన్నారు. కేసీఆర్ దళిత వ్యతిరేక నాయకుడు అని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ బహిష్కరించిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా తెచ్చారన్నారు. త్వరలో కేసీఆర్ తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటాడని..

డీజిల్ ధరలు బూచి చూపించి ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచిందని విష్ణువర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తం మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేసి సజ్జలకే అన్నీ అప్పచెప్పవచ్చు కదా అని జగన్‌కు సూచించారు. ఏపీలో మంత్రులు డమ్మీ మంత్రులా అని నిలదీశారు. ఏపీ మంత్రులు తీసేసిన తహసీల్దారుల్లా ఉన్నారని.. ఏ అంశంలో అయినా మంత్రుల బదులు సలహాదారులు మాట్లాడుతున్నారని చురకలు అంటించారు. పేద ప్రజలపై వైసీపీ ప్రభుత్వం భారం మోపుతోందని.. ఇటీవల సీఎం జగన్ ఒక బూతు పదం మాట్లాడుతున్నారని.. ఏపీలో ఫ్రస్ట్రేషన్ పాలన ఉందని.. బూతులకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టాలని.. ఎవరైనా బూతులు నేర్చుకోవాలంటే మన రాష్ట్రానికి రావాలని చెప్పాలంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు.