Vishakapatnam Police: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఈ పర్యటనలో మంత్రులపై రాళ్ల దాడి జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు విశాఖ సిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్‌లో మీడియా సమక్షంలో విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర ఆయనకు నోటీసులు అందజేశారు. విశాఖ నగరంలో పోలీస్ యాక్ట్, సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించినందుకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. 500 మందికిపైగా ర్యాలీలో పాల్గొన్నట్లు నోటీసుల్లో పోలీసులు తెలిపారు. అలాగే విశాఖ గర్జన ర్యాలీకి హాజరై తిరిగి వెళ్తున్న మంత్రులు, స్థానికులు, పోలీసులపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఏసీపీ హర్షిత చంద్ర తెలిపారు. స్థానికులు, పోలీసుల ఫిర్యాదుతో నోటీసులు అందజేస్తున్నట్లు తెలిపారు.
Read Also: NBK: అన్ స్టాపబుల్‌కు చిరు ఎస్.. నాగ్ నో..!!
కాగా విశాఖలో అక్టోబర్ 31 వరకు నగరంలో ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమాలకు అనుమతి లేదని విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర స్పష్టం చేశారు. అనుమతి లేకుండా జనసేన భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగించారంటూ పోలీసులు అన్నారు. కాగా శనివారం సాయంత్రం 4:30 గంటలకు తాను విశాఖ వచ్చేటప్పటికే గొడవ జరిగిపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. దానికి తాను బాధ్యుడిని అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. రుషికొండపై జరిగిన విధ్వంసాన్ని చూపిస్తామని డ్రోన్లు అనుమతి రద్దు చేశారని ఆరోపించారు. ఈ రోజు తన మీద ఎన్ని కేసులు పెట్టినా రెడీగా ఉన్నానని.. జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగానే ఉన్నానని పవన్ స్పష్టం చేశారు. సెక్షన్ 30 కింద తనకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులు వచ్చే వరకు తాను వైజాగ్‌లోనే ఉంటానని.. అధికారం ఉన్నవాళ్లు గర్జించడం ఏంటని పవన్ ఎద్దేవా చేశారు.
