Vizag Steel Plant Blast: స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్‌ అధికారులపై వేటు..

  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఏడుగురు సీనియర్‌ అధికారులపై వేటు..
  • SMS-1లో ప్రమాదంపై ముగిసిన అంతర్గత విచారణ..
  • గత నెల 8న జరిగిన ప్రమాదం..
  • ప్రాణాలు కోల్పోయిన 10మంది ఉద్యోగులు, కార్మికులు..
Vizag Steel Plant

Vizag Steel Plant

Vizag Steel Plant Blast: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో 10 మంది ప్రాణాలను బలితీసుకున్న భారీ పేలుడు ప్రమాదంపై విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. SMS 1లో గత నెల 8వ తేదీన జరిగిన దుర్ఘటనకు నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. దీంతో ప్రమాదానికి బాధ్యులను చేస్తూ ఏడుగురు ఉద్యోగులపై యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రమాదం జరిగిన రోజు ప్లాంట్‌ను పరిశీలించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రమాదానికి కారణాలు వెలికితీయడానికి త్రి సభ్య కమిటీని నియమించారు. సెయిల్ బొకారో ప్లాంటుకు చెందిన డైరెక్టర్ ఇంఛార్జ్‌ ప్రియా రంజన్, చీఫ్ జనరల్ మేనేజర్ జితేంద్రకుమార్, మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ గోపాల్ సింగ్ తో కూడిన కమిటీ గత నెల 10వ తేదీ నుంచి విచారణ ప్రారంభించింది.

 

ఇక, త్రి సభ్య కమిటీ నివేదిక ఆధారంగా.. ఎస్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంటూ యాజమాన్యం చర్యలు తీసుకుంది. సీనియర్ మేనేజర్, డీజీఎం కేడర్ అధికారులు ఇందులో వున్నారు. మృతదేహాల తరలింపులో యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని పేర్కొంటూ అప్పట్లో హెచ్‌ఆర్‌ విభాగంలో ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి, మరో ముగ్గురిని బదిలీ చేశారు. లాడిల్ లో పేలుడుకు నాసిరకం ఫెర్రో అల్లాయిస్ కారణమని ఆరోపణలు రావడంతో ఆయా విభాగాలకు చెందిన 22 మందిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఆ తరువాత సస్పెన్షన్ ఎత్తివేసి షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారిపై విచారణకు ఆదేశించింది.