South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం సర్‌ప్రైజ్ గెజిట్..

Trains

Trains

South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్థరాత్రి తర్వాత విడుదల చేసిన గెజిట్ ద్వారా South Coast Railway Zone ఏర్పాటు అధికారికంగా ప్రకటించింది. రైల్వే చట్టం ప్రకారం ఈ కొత్త జోన్ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఈ జోన్‌కు ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది. ఈ కొత్త రైల్వే జోన్‌ను ఇప్పటికే ఉన్న East Coast Railway మరియు South Central Railway జోన్ల నుంచి విభజించి ఏర్పాటు చేస్తున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తాయి. అలాగే ప్రస్తుత వాల్టేర్ డివిజన్‌ను విభజించి, విశాఖపట్నం డివిజన్‌గా మార్చే ప్రక్రియను కూడా ప్రారంభించారు.

వాల్టేర్ డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించడం ఈ నిర్ణయంలో ముఖ్యాంశం. ఒక భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొత్త రాయగడ డివిజన్‌గా ఏర్పాటు చేస్తుండగా, మిగిలిన భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో విశాఖ డివిజన్‌గా మార్చనున్నారు. ఈ మార్పులు కూడా జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చర్యల వల్ల రైల్వే పరిపాలన మరింత సమర్థవంతంగా మారి, ప్రాంతాల వారీగా పర్యవేక్షణ మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. రాయగడలో ఏర్పాటు చేసే కొత్త డివిజన్‌లో కోరాపుట్–సింగపూర్ రోడ్, కొత్తవలస–కిరండూల్, కునేరు–థెరువలి, గుణుపూర్–పర్లకిమిడి వంటి మార్గాలు చేరనున్నాయి. ఈ డివిజన్ మొత్తం 696 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అదనంగా పలాసా–ఇచ్ఛాపురం మార్గాన్ని ఖుర్దా రోడ్ డివిజన్ నుంచి విశాఖ డివిజన్‌కు బదిలీ చేశారు.

×
×
Ad

ఇక, ఆపరేషనల్ అవసరాల దృష్ట్యా గుంటకల్, గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్ డివిజన్ల మధ్య కూడా మార్పులు చేపట్టారు. రాయచూర్–వాడి, విష్ణుపురం–పగిడిపల్లి మార్గాలు సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ అయ్యాయి. కొండపల్లి–మోతుమర్రి మార్గాన్ని విజయవాడ డివిజన్‌లో చేర్చారు. కొత్త సరిహద్దులను కూడా స్పష్టంగా నిర్ణయించారు. మొత్తంగా ఈ మార్పులతో రైల్వే మార్గాల నిర్వహణ సులభతరం అవుతుందని, సేవల సమన్వయం మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి మరింత వేగం వస్తుందని ఆశిస్తున్నారు.