Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి కార్మికులు ధర్నాకు దిగారు.. దీంతో, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట కార్మికులు భారీ స్థాయిలో మహా ధర్నా చేపట్టారు. కార్మికుల వేతనాలను ఉత్పత్తి ఆధారంగా చెల్లించాలన్న సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.
Read Also: Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. సమాచారం కోసం ఈ నంబర్స్‌కి కాల్ చేయండి..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నాణ్యమైన రా మెటీరియల్స్ సరఫరా, యంత్రాల మరమ్మతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని.. ఇప్పుడు తమ వైఫల్యాలను కార్మికులపై మోపడం అన్యాయం అని మండిపడుతున్నారు కార్మికులు.. దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే మంత్రులు, ఎంపీలు జీతాలు తగ్గించుకున్నారా?” అని ప్రశ్నించారు. కార్మికులను కవ్వించి ఉద్యమాన్ని అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ చర్యలు కార్మికుల పొట్టగొట్టే కుట్రలే అని జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా విమర్శించింది. ఈ పరిణామాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సుదీర్ఘ ఉద్యమం కొనసాగిన విషయం విదితమే..
