NTV Telugu Site icon

School Holidays: ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన..

Holiday

Holiday

School Holidays: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలపడుతోంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయిన వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈ శాన్యంగా 390 కిలోమీటర్లు.. విశాఖకు దక్షిణాన 430 కిలోమీటర్ల దూరంలో నెమ్మదిగా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది.. గంటకు 5 కిలోమీటర్ల కి.మీ వేగంతో ఈశాన్య దిశగా కదులుతుఏపీ తీరానికి సమాంతరంగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తీరం వెంబడి బలంగా గాలులు వీస్తున్నాయి..

Read Also: Shivaratri Brahmotsavam 2025: శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై ఫోకస్‌

మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. గోపాలపట్నం ఇందిరానగర్‌లో ప్రహరీ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలకు తోడు, కారుమబ్బులు కమ్మేశాయి.. ఇక, వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న దృష్ట్యా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు వెల్లడించారు జిల్లా కలెక్టర్‌..

Show comments