BV Raghavulu: రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. రాష్ట్రం పరిశ్రమల రంగంలో వేగంగా ముందుకు వెళ్తోందన్న కూటమి నాయకుల వ్యాఖ్యలు మాటలకే పరిమితమైపోయాయని ఆయన అన్నారు. విశాఖలో రాఘవులు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల కాలంలో కూడా ఎన్నో పెట్టుబడుల సదస్సులు జరిగినప్పటికీ, వాటిలో కుదిరిన ఒప్పందాల్లో 10 శాతం కూడా అమలుకాలేదని గుర్తుచేశారు. భూములు పొందడానికే కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని, కానీ, పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. గతంలో కేటాయించిన తరహా భూముల్లో ఇప్పటికీ పెద్ద భాగం ఖాళీగానే ఉందని అన్నారు.
Read Also: Varanasi: ‘వారణాసి’ గ్లింప్స్‌పై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..!
గత రెండేళ్లలో రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయని రాఘవులు పేర్కొన్నారు. పర్యటనలు, భారీ సదస్సులు నిర్వహించడం కంటే, నిజంగా పెట్టుబడులు పెట్టే పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడం ముఖ్యం అని సూచించారు. డేటా సెంటర్లు పెద్దగా ఉపాధి అవకాశాలను సృష్టించలేవని, కూలీలు–యువతకు ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్‌కు నాసిరకం ముడిసరుకు సరఫరా అవుతోందని, ఉద్యోగులకు జీతాలు సమయానికి అందడం లేదని ఆరోపించారు. ప్లాంట్‌లో కీలక పదవులు ఖాళీగా ఉండటాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు. మరోవైపు, దేశంలో విమానాయాన రంగం సంక్షోభానికి గురవడం కూడా ప్రైవేటీకరణ విధానాల ఫలితమని రాఘవులు వ్యాఖ్యానించారు.
