NTV Telugu Site icon

Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం..! సెయిల్‌లో విలీనం..!

Vizag Steel Plant

Vizag Steel Plant

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి.. కేంద్రం ఏ చేయబోతోంది. ప్రైవేటీకరిస్తాం అని ఇప్పటికే చెప్పిన కేంద్రం.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిందా.. ప్రైవేటీకరణకు బదులుగా.. మరో ఆప్షన్‌ను ట్రై చేస్తోందా.. ఇప్పుడివే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మనుగడకు శాశ్వత పరిష్కారంపై కేంద్రం దృష్టిపెట్టింది. మరో ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్‌లో విలీనం చేస్తే ఎలా ఉంటుందా అనే కోణంలో దృష్టిపెట్టింది. అలాగే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములను ఎన్ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది. ఇదే అంశాలపై సెయిల్‌తో పాటు.. ఎన్‌ఎండీసీ ఛైర్మన్‌లతో కేంద్రం చర్చలు జరుపుతోంది.

Read Also: Hurricane Helene : ఫ్లోరిడా, జార్జియాలో హెలెన్ హరికేన్ విధ్వంసం.. 30 మంది మృతి

ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్‌లో విలీనం చేస్తే మంచిదనే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెయిల్‌లు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులుగా శాశ్వత పరిష్కారం కోసం ఈ రెండింటినీ విలీనం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. రుణాల నుంచి బయటపడేందుకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాల భూములను ఎన్‌ఎండీసీకి విక్రయించే ప్రతిపాదనలు, బ్యాంకు రుణాల వంటి అంశాలను పరిశీలిస్తోంది. స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్. దాని కోసం పెద్ద ఉద్యమమే నడిచింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్‌కి మనుగడ కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు గానీ.. ఏపీలో కూటమి ప్రభుత్వం దీనిపై పెద్దగా స్పందించలేదు. అయితే.. తెరవెనక చర్చలు జరుగుతున్నాయనీ, ప్రైవేటీకరణ కాకుండా ఇతర ఆప్షన్స్ చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.