Visakhapatnam: విశాఖపట్నం జిల్లాలో భూ కబ్జాదారుల ఆగడాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పెందుర్తి మండలం చింతగట్ల ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఖాళీ చేయించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడికి యత్నించారు. సర్వే నంబర్ 57/1, 57/2లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు రెవెన్యూ సిబ్బంది జేసీబీతో అక్కడికి చేరుకున్నారు. అయితే, భూమి ఖాళీ చేయడాన్ని అడ్డుకునేందుకు భూ కబ్జాదారులు రెవెన్యూ సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు.
Read Also: Sankranti Rush: కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ.. బస్సులు, రైల్వే స్టేషన్లలో కిక్కిరిసిన జనం
ఇక, ఈ ఘటనలో ఆక్రమణదారులు జేసీబీతో ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి భయంతో రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ సంఘటన ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.