CBI Arrest: విశాఖపట్నంలో లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అధికారి

Cbi

Cbi

CBI Arrest: ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన కంటైనర్ల క్లియరెన్స్ కోసం లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్ (పీక్యూఎస్) అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అందిన వివరాల ప్రకారం… విశాఖపట్నంలోని ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్ కేంద్రంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యవహారంలో సదరు అసిస్టెంట్ డైరెక్టర్ సహా ఇద్దరు అధికారులు, ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు, మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులపై నవంబర్ 6, 2026న సీబీఐ కేసు నమోదు చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన కంటైనర్లకు అవసరమైన క్లియరెన్స్ పత్రాలు మంజూరు చేసేందుకు నిందితుడైన అసిస్టెంట్ డైరెక్టర్ రూ.1,00,000 లంచం డిమాండ్ చేశారు.

దీనిపై సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నవంబర్ 6న వ్యూహాత్మకంగా వలపన్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి సదరు అధికారి రూ.లక్ష లంచం నగదు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును రికవరీ చేసిన అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు లంచం ఇచ్చిన ప్రైవేట్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు చెందిన విశాఖపట్నం, ఫరీదాబాద్, అలాగే కర్ణాటకలోని కోలార్ జిల్లా తిమ్మనపల్లి గ్రామాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ బృందాలు ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించాయి. పట్టుబడిన ఇద్దరు నిందితులను శనివారం విశాఖపట్నంలోని సంబంధిత న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.