Site icon NTV Telugu

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ను ముంచేసే కుట్ర జరుగుతుందా..?

Visakha

Visakha

Visakha Steel Plant: తెలుగు ప్రజల గుండె చప్పుడు, ప్రైడ్ ఆఫ్ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముంచేసే కుట్ర జరుగుతోందా..? ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనలు ఎలా ఉన్నా, తెరవెనుక ప్లాంట్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చాప కింద నీరులా జరుగుతోందనే అనుమానాలు ఇప్పుడు తీవ్రమవుతున్నాయి. నాలుగు దశాబ్దాల పాటు దేశీయ ఉక్కురంగంలో తనదైన ముద్ర వేసి, నాణ్యతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విశాఖ ఉక్కు ఉత్పత్తులకు ఇప్పుడు ‘నాణ్యతా లోపం’ అనే ముప్పు వచ్చి పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక మద్దతు కనిపిస్తున్న తరుణంలో, నాణ్యతను పెంచుకోవాల్సింది పోయి… అసలుకే మోసం తెచ్చేలా క్వాలిటీ విషయంలో రాజీ పడుతున్నారనే కొత్త కుట్రలు తెరపైకి రావడం అందరినీ కలవరపెడుతోంది. జాతీయ ప్రాజెక్టుల నుంచి సామాన్యుడి ఇల్లు వరకు అందరూ కోరుకునే వైజాగ్ స్టీల్‌ను ఇప్పుడు నాణ్యత లేదంటూ కంపెనీలు వెనక్కి పంపుతున్నాయి.

విశాఖ ఉక్కు కర్మాగారం నలభై ఏళ్లుగా నాణ్యత పునాదుల మీద తిరుగులేని ప్రస్థానం కొనసాగించింది. సొంత గనులు లేకపోయినా, ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టి కేంద్రం త్రిశంకు స్వర్గంలోకి నెట్టివేసినా.. కార్మికులు మాత్రం ఎక్కడా రాజీ పడకుండా ఉత్పత్తిని సాధిస్తూనే ఉన్నారు. అయితే, చరిత్రలో ఊహించని విధంగా, వైజాగ్ స్టీల్ ఉత్పత్తులు ఇప్పుడు నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నాయి. పారిశ్రామిక వర్గాలు నాణ్యత సరిగా లేదనే కారణంతో సుమారు 18,500 టన్నుల బిల్లెట్స్‌ను తిప్పి పంపడం కార్మిక వర్గాల్లో తీవ్ర భయాలను సృష్టించింది. రైల్వేకు సరఫరా చేసిన ఉత్పత్తులు సైతం నాణ్యతా తనిఖీలో విఫలమైనట్లు తేలింది.

Pawan Kalyan : అటవీ సిబ్బంది భద్రత కోసం ‘సంజీవని’

ఈ నాణ్యతా లోపానికి ప్రధాన కారణం… ఉత్పత్తికి క్వాలిటీ చెక్ చేసే థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఏజెన్సీలను దాదాపు సంవత్సరం పాటు అర్ధాంతరంగా తొలగించడమేనని కార్మిక సంఘాలు బలంగా ఆరోపిస్తున్నాయి. దీనివల్ల క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసే వ్యవస్థ లేకుండా పోయింది. మరోవైపు, సొంత గనులు లేకపోవడంతో టన్నుకు ₹5,000 అదనంగా ఖర్చు చేసి ముడిసరుకు కొనాల్సిన దుస్థితి. ఇటీవల ముడిసరుకుల కొరత కారణంగా, నాణ్యత లేని కోకింగ్ కోల్ లేదా ఐరన్ ఓర్‌ను ఉపయోగించడం వల్లే స్టీల్‌లో పెళుసుదనం పెరిగి, తుప్పు పట్టి, నాణ్యత దెబ్బతింటోందని ఆరోపణలు వస్తున్నాయి. యాజమాన్యం సరైన జాగ్రత్తలు పాటించకపోయినా, అధికారులు గుర్తించినా పట్టించుకోకపోయినా, నాసిరకం ఉత్పత్తులు తయారవుతున్నాయని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ప్లాంట్‌లోని కీలక విభాగాలను ప్రైవేట్‌కు అప్పగించేందుకు ఈఓఐ ప్రకటన ఇచ్చారు. ఈ ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే క్వాలిటీ చెక్‌లో ఉక్కు ఫెయిల్ అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం నాణ్యతా లోపం కాదని, దీర్ఘకాలంలో ఫర్నెస్‌లు దెబ్బతిని, ప్లాంట్ షట్‌డౌన్ అయ్యేందుకు కారణమయ్యే ఒక తెరవెనుక కుట్రగా కార్మిక వర్గాలు భావిస్తున్నాయి. వైజాగ్ స్టీల్ నాణ్యత కారణంగా తుప్పు పట్టని ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యం ఉన్న పరిశ్రమ, ఇప్పుడు నాణ్యత విషయంలో రాజీ పడటం వెనుక బాధ్యులు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

CM Chandrababu : ఆ మంత్రులపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..

 

Exit mobile version