NTV Telugu Site icon

AP Volunteers: చలో విజయవాడకు పిలుపునిచ్చిన వాలంటీర్లు.. పోలీసులు సీరియస్..!

Valentors

Valentors

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల సాయం తీసుకోకుండా.. పెన్షన్లను పంపకాలు చేసింది. లక్షా 20 వేల మంది సచివాలయ సిబ్బందే ఒక్కరోజులో మాగ్జిమం పెన్షన్లను వృద్దులకు, వితంతువులు, వికలాంగులకు పంపిణీ చేసేశారు. దీంతో వాలంటీర్లతో ఇక పనేముంది? వాళ్లను ప్రభుత్వం తొలగిస్తుంది.. అనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దాంతో వాలంటీర్లలో ఆందోళన స్టార్ట్ అయింది. తమను తొలగిస్తారేమో అని వారు ఆందోళన పడుతున్నారు. అయితే, వాలంటీర్లను తొలగిస్తామని ప్రభుత్వం ఎక్కడా కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. పైగా, నిన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై కీలక ప్రకటనలు కూడా చేశారు.

Read Also: Midnight Scrolling: అర్ధరాత్రి మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీరు ఈ వ్యాధి బారినపడే అవకాశం..

అయితే, గ్రామంలో వాలంటీర్ అయి ఉండి, ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం లేదా భరోసా కలిపించకపోవడంతో.. వాలంటీర్ల వ్యవస్థకు భద్రత కల్పించాలని కోరుతూ రేపు( బుధవారం) ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కానీ, ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు.. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఛలో విజయవాడ కార్యక్రమంపై విజయవాడ పోలీసులు రియాక్ట్ అయ్యారు. వాలంటీర్లు రేపు ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు అని వెల్లడించారు. అలాగే, మాకు అనుమతి కోసం ఎలాంటి దరఖాస్తు రాలేదు అని పేర్కొన్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30 అమల్లో ఉంది.. కాబట్టి అనుమతి లేదనే విషయాన్ని వాలంటీర్లకు తెలియజేస్తున్నామని పోలీసులు తెలియజేశారు. ఇక, వేరే ప్రాంతాల నుంచి విజయవాడ నగరానికి వచ్చే వాలంటీర్లను అదుపులోకి తీసుకోవటానికి రైల్వే స్టేషన్, బస్టాండ్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.