NTV Telugu Site icon

VMC council meeting: వీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస.. అసలు ఏమైంది..?

Vmc

Vmc

VMC council meeting: వీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభసాగా మారింది.. మొదట మామూలుగా ప్రారంభమైన వీఎంసీ కౌన్సిల్ సమావేశం తరువాత కొంత రసాభసాగా మారింది‌‌‌.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాకపోవడం పై పెద్దగా చర్చ జరగకపోవడం విశేషం.. వీఎంసీలో మెజారిటీ మెంబర్లు వైసీపీ కార్పొరేటర్లుగా ఉండటం.. 122 అంశాలు, 20 ప్రశ్నలతో కూడిన కౌన్సిల్ సమావేశం అన్ని రకాల రుచులు మేళవించిన కదంబంలా జరిగింది.. అయితే, మీడియాను కౌన్సిల్ లోకి అనుమతించే అంశం పై చర్చతో మొదలైన సమావేశంలో మీడియా అనుమతిపై చర్చ వేడి వాడిగా జరగడం, ఆ తరువాత రసాభసాగా మారడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.. కౌన్సిల్ లో నీటి కాలుష్యంపై బలంగానే చర్చ జరిగింది.. నీటి కలర్ మారడంపై టెస్టింగుల పేరిట రోడ్లు తవ్వేసారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు‌.. 1985 ముందు వేసిన పైప్ లైన్లు ఇంకా ఉన్నాయని.. మార్చాలని.. టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు… పటమట ప్రాంత ప్రజల పట్ల చిన్నచూపు వద్దన్నారు టిడిపి కార్పొరేటర్లు..

ఇక, అమృత్ పథకం ద్వారా జరిగే పనులలో ఛీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లకు మధ్య సమన్వయ లోపం కౌన్సిల్ చర్చలో కొట్టొచ్చినట్టు కనిపించింది.. సిల్ట్ కృష్ణానదిలో డంప్ చేయడంపై అధికారులపై మేయర్ సీరియస్ అవ్వడంతో సిల్ట్ డంపింగ్ కు ప్రత్యేక స్ధలం చూడాలని ప్రతిపాదన తీసుకొచ్చారు. ఔట్ ఫాల్ డ్రైన్ మూసేస్తే రాణీగారి తోట, భూపేష్ గుప్తా నగర్ లాంటి ప్రాంతాలు వర్షం పడితే మునిగిపోతాయని చర్చకు తీసుకొచ్చారు.. రీటైనింగ్ వాల్ కట్టినా కూడా ఔట్ ఫాల్ డ్రైన్ విషయంలో చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు లేవనెత్తారు.. వర్షాకాలం మొత్తం కృష్ణానదిలోకి వదిలేయాలని, డ్రైన్ లు క్లీన్ చేయాలని ఆదేశించారు మేయర్… కార్మికులకు ఇస్తున్న ట్రాలీలు పాడైపోతే పట్టించుకునే నాధుడు లేడని టిడిపి కార్పొరేటర్లు ఆరోపించారు.. కార్మికులలో వయసు మీద పడ్డ వారి విషయంలో నిర్లక్ష్యం అంటూ టిడిపి కార్పొరేటర్లు విమర్శించారు. అధికారులు కార్మికులకు ఇచ్చే సామాన్య అవసరాలు కూడా ఇవ్వలేని పరిస్ధితిలో కార్పొరేషన్ అంటూ టిడిపి కార్పొరేటర్లు మండిపడ్డారు.

మేయర్ ఉత్సవ విగ్రహంలా మారారు అంటూ సీపీఎం కార్పొరేటర్ అనడంతో కొంత వేడీ వాడిగా మారింది కౌన్సిల్… కమిషనర్ వద్ద కార్మికుల ఫైల్ ఉండిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేయర్ ప్రశ్నించడంతో ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్న మేయర్ అనే చర్చ కూడా కౌన్సిల్ సభ్యులలో జరిగింది… మేయర్ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అణిచేస్తోందని సీపీఎం కార్పొరేటర్ ఆరోపించడంతో.. అలాంటిది ఏమీ లేదు అంటూ సీపీఎం కార్పొరేటర్ మైక్ ఆఫ్ చేసారు. ఏపీలో NDA గెలుపుకు అభినందనలు తెలుపుతూ కౌన్సిల్ లో తీర్మానం ప్రవేశపెట్టారు టిడిపి కార్పొరేటర్లు‌‌. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు అందాలంటే విజయవాడ ఎంపీ, ఎంఎల్ఏ లని కార్పొరేషన్ తరఫున సన్మానించాలని తీర్మానించారు‌.. మేయర్ కి గతంలో ఒత్తిడులు ఉండేవన్న టిడిపి కార్పొరేటర్ల కామెంట్ పై మేయర్ క్లారిటీ ఇచ్చారు‌.. అనంతరం చెత్త పన్ను రద్దు చేయడాన్ని ఆహ్వానించిన కార్పొరేటర్లు, చెత్తపన్ను రద్దు పై జీఓ రావాలని పట్టుబట్టారు….

ఇక, మాకుంది లెక్క మాకిష్టం కుక్క అంటూ చెపుతున్న జీవకారుణ్య సంఘాల ప్రతినిధులు అందరూ తరువాత కౌన్సిల్ కు వీఎంసీ కి రావాలన్నారు కార్పొరేటర్లు… వాళ్ళు తరువాత కౌన్సిల్ కు రాకపోతే కచ్చితంగా కోర్టులో సదరు జంతు ప్రేమికులపై పిటిషన్ వేయాలని కార్పొరేటర్లు కార్పొరే ను డిమాండ్ చేసారు.. ఇప్పటికే కుక్కల అంశం పై ఒక పిటిషన్ ఫైల్ అయిందని అధికారులు చెబితే..‌ కార్పొరేషన్ తరపున ప్రత్యేక పిటిషన్ వేయాలని ఆదేశించారు మేయర్.. జీవకారుణ్య సంస్ధల ప్రతినిధులు అంతా కౌన్సిల్ కు వచ్చి తీరాలి అంటూ డిమాండ్ చేసింది విజయవాడ మునిసిపల్ కౌన్సిల్.. పార్టీలకు అతీతంగా ఈ ప్రతిపాదనపై టిడిపి, వైసీపీ ఒకే తాటిమీదకు వచ్చి మాట్లాడాయి.. కుక్కల సమస్య కోసం ప్రత్యేక కౌన్సిల్ నిర్వహించేందుకు కూడా మేయర్ అంగీకరించారు… విజయవాడ నగరపాలక సంస్ధ గోశాల పేరిట ఒక గోశాల ను ఎక్సెల్ ప్లాంటు వద్ద ఏర్పాటు చేయాలని మేయర్ ఆదేశాలు జారీ చేసారు… రోడ్లపై గోవులను వదిలేస్తే.. వాటిని విజయవాడ నగరపాలక సంస్ధ గోశాలకు తరలించాలని మేయర్ ఆదేశాలు జారీ చేసారు.. గోవుల యజమానులు వస్తే జరిమానా 5వేలు పైన ఉండేలా విధించాలని అధికారులకు మేయర్ సూచించారు.. ఎట్టకేలకు అన్ని అంశాలపై పూర్తి చర్చ అనంతరం… సజావుగా పూర్తయిన కౌన్సిల్ సమావేశం తదుపరి షెడ్యూల్ త్వరలో తెలుపుతాం అంటూ మేయర్ వాయిదా వేసారు‌.