Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్

Saikrishna Custodial Death

Saikrishna Custodial Death

Sai Krishna Lockup Death Case: విజయవాడలో సంచలనం సృష్టించిన కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. తాజాగా కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లను మరోసారి కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిట్ సిద్ధమైంది. A2 అశోక్ కుమార్, A3 జంగం నాని, A4 బాబురావు, A6 సాంబయ్య, A7 వెంకటరాజును రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో సీఐ నాగరాజు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా.. కొన్ని కీలక అంశాలపై మరోసారి విచారణ చేయాల్సి ఉందని సిట్ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఒకసారి కస్టడీలోకి తీసుకుని విచారించిన హెడ్ కానిస్టేబుళ్లను.. ఇప్పుడు రెండోసారి కస్టడీకి కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు దారితీసిన పరిస్థితులు ఏంటి..? పోలీస్ స్టేషన్‌లో అసలు ఏం జరిగింది..? సీఐ నాగరాజు స్టేట్మెంట్‌లో ఉన్న కీలక అంశాలు ఏంటి..? అనే కోణాల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. రెండోసారి కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా..? విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.