Site icon NTV Telugu

Vijayawada Metro Rail: విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ టెండర్ల గడువు పొడిగింపు

Metro Rail

Metro Rail

Vijayawada Metro Rail: విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ టెండర్ల గడువును పొడిగించింది ఆంధ్రప్రదేశ్‌ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌.. మెట్రో రైల్‌ ప్రాజెక్టు టెండర్ల గడవు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో.. మరో 10 రోజులు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. దీంతో.. ఈ నెల 24వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌.. దీంతో, టెండర్లు వేసేందుకు సిద్ధమవుతున్న కంపెనీలకు కాస్త ఉపశమనం లభించినట్టు అయ్యింది.. ఇక, విజయవాడ మెట్రో టెండర్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ప్రధాన ఇన్‌ఫ్రా కంపెనీలు.. కాంట్రాక్టు సంస్థల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (APMRC) పేర్కొంది..

Read Also: Ponnam Prabhakar : ప్రజలు బీఆర్ఎస్‌కి గట్టి బుద్ధి చెప్పబోతున్నారు

కాగా, ఏలూరు రోడ్, బందరు రోడ్ ఈ రెండు కారిడార్లకు కలిపి ఒకే సింగిల్ టెండర్ విధానం ద్వారా ప్రక్రియను చేపట్టనుంది ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్.. సుమారు రూ.4,500 కోట్ల వ్యయంతో టెండర్లను ఆహ్వానించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రీ-బిడ్డింగ్ మీటింగ్‌లో 10కి పైగా బడా కంపెనీలు పాల్గొన్నాయి. జాయింట్ వెంచర్ విధానంలో పోటీకి రంగంలోకి దిగేందుకు పలువురు నిర్మాణ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ముందుగా టెక్నికల్ బిడ్లు, ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన సంస్థలకు టోపోగ్రఫీ, జియోగ్రాఫికల్ సర్వేలు .. సాయిల్ టెస్టులు నిర్వహించనున్నారు.. ఈ సర్వేలకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర అనుమతులు లభించగానే క్షేత్ర స్థాయిలో మెట్రో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏలూరు రోడ్‌పై డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రతిపాదనను కూడా ఏపీఎంఆర్సీ సిద్ధం చేసింది. డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖకు పంపించింది. అనుమతులు లభిస్తే, విజయవాడ మెట్రో పనులు ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు అధికారులు..

Exit mobile version