Site icon NTV Telugu

LPG Booking Messages Without Booking: గ్యాస్‌ ఏజెన్సీల గోల్‌మాల్‌..! LPG బుక్‌ చేయకుండానే.. బుక్‌ చేసినట్టు మెసేజ్‌లు..

Lpg Gas Price

Lpg Gas Price

LPG Booking Messages Without Booking: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల గ్యాస్‌ సిలిండర్ల కొరత ఏర్పడింది.. ముఖ్యంగా విజయవాడలోని గ్యాస్ ఏజెన్సీపై గోల్‌మాల్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్లు బుక్ చేయకుండానే గ్యాస్ సిలిండర్ బుక్ అయినట్లు మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వస్తుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని సాయిరామ్ థియేటర్ సమీపంలో ఉన్న భారత్‌ గ్యాస్‌ కు చెందిన తరుణీ శ్రీ భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

బుక్ చేయకుండానే మెసేజ్‌లు
కొంతమంది వినియోగదారుల ఫోన్లకు తాము గ్యాస్ బుక్ చేయకపోయినా బుకింగ్ అయినట్లు మెసేజ్‌లు రావడంతో వారు ఏజెన్సీకి వెళ్లి వివరాలు అడిగారు. అయితే ఈ విషయానికి తమకు సంబంధం లేదని ఏజెన్సీ సిబ్బంది సమాధానం ఇస్తున్నారని కస్టమర్లు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్లు ప్రస్తుతం అందుబాటులో లేవని, ఏప్రిల్‌లో సరఫరా అవుతాయని అప్పటివరకు వేచి ఉండాలని ఏజెన్సీ సిబ్బంది చెబుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ఏజెన్సీ వద్ద భారీ క్యూలు
ఈ పరిణామాలతో గ్యాస్ ఏజెన్సీ వద్ద వందలాది మంది కస్టమర్లు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. సిలిండర్ల కోసం పెద్ద ఎత్తున క్యూలు కనిపించాయి. మరోవైపు.. కస్టమర్ల పేర్లతో గ్యాస్ సిలిండర్లు బుక్ చేసి వాటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారని కొంతమంది వినియోగదారులు ఏజెన్సీపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Exit mobile version