Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై VIP, VVIPలు సైతం దర్శనం కోసం తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందే అని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో సుమారు 30 వేల మంది, శుక్రవారం, శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 50 వేల వరకు చేరుతోంది. అయితే, రోజుకు 200–300 మంది వరకు సిఫార్సు లెటర్లతో వచ్చే VIPలు, VVIPలు టికెట్ కొనకుండా దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ ఈవో శీనా నాయక్ దృష్టికి వెళ్లింది.. ఇదే కాకుండా, కొంతమంది ప్రోటోకాల్ పేరుతో టికెట్ లేకుండానే దర్శనాలు చేస్తున్నారని, దీని వల్ల ఆలయ ఆదాయానికి భారీ గండి పడుతోందని అధికారులు గుర్తించారు. దీంతో ఈ పద్ధతికి అడ్డుకట్ట వేయాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు.
Read Also: CM Revanth Reddy: ఈ మనుషుల విషం.. మూసీలో మురికి కంటే ఎక్కువ..
ఈ ప్రతిపాదనపై ఆలయ ఈవో శీనా నాయక్, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ధర్మకర్త మండలి సభ్యులు, ఇతర ఆలయ అధికారులతో కలిసి విస్తృత సమీక్ష నిర్వహించారు. సిఫార్సు లెటర్లతో వచ్చే ప్రతి ఒక్కరూ టికెట్ కొనాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ నిబంధనను ముందుగా ధర్మకర్తల మండలి సభ్యుల నుంచే అమలు చేయాలి అని చైర్మన్ రాధాకృష్ణ సూచించారు. ఈ నిర్ణయానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కూడా ఎడీసీఎల్ (ADCL) ఛైర్‌పర్సన్ & MDకు ఆదేశాలు జారీ చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు టికెట్ కొనకుండా వెళ్లడం వల్ల హుండీ, దర్శన టికెట్ ఆదాయం తగ్గిపోతోందని ఆలయ అధికారులు తెలిపారు. కొత్త నిబంధనతో అమ్మవారి సేవా కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని, ఆలయ అభివృద్ధికి నిధుల లభ్యత పెరుగుతుందని చెప్పారు.
