Vijayawada: వంగవీటి రాధా ప్రమాణ స్వీకారం వేళ కూటమిలో కలకలం.. ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా!

Vangaveeti Radha

Vangaveeti Radha

Vijayawada: బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా ప్రమాణ స్వీకార కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. నగర మేయర్‌గా వంగవీటి రాధాతో పాటు 86 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి బెజవాడకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అది కూడా అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలే కావడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమా, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరుకాలేదు. వీరితో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బుద్ధా వెంకన్న, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కీలక నేతలు ఒకే కార్యక్రమానికి గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించే విషయంలో ప్రోటోకాల్ పాటించలేదనే అసంతృప్తి ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల్లో వ్యక్తమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆహ్వానాల విషయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కొందరు నేతలు అలిగినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నాయా? అనే చర్చ మొదలైంది.

అయితే ఎమ్మెల్యేలు వేర్వేరు కారణాలతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదని వారి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. గైర్హాజరుకు వ్యక్తిగత కారణాలేనా? లేక ఆహ్వానాలు, ప్రోటోకాల్ విషయంలో అసంతృప్తి కారణమా? అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మేయర్‌గా వంగవీటి రాధా బాధ్యతలు స్వీకరించిన వేళ కీలక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కార్యక్రమానికి దూరంగా ఉండటం విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరు వెనుక కారణాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.