Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని

Nara Lokesh, Perni Nani

Nara Lokesh, Perni Nani

Perni Nani: వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పేర్ని నాని 2025 మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేష్ కేవలం డీఎస్సీ నియామకాల కోసమే ఉపయోగించుకున్నారని, మొత్తం నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఎస్సీఆర్టీ కన్వీనర్‌కే డీఎస్సీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒకే వ్యవస్థ చేతిలో జరిగాయని ఆయన అన్నారు. గోప్యంగా ఉండాల్సిన పరీక్షల ప్రక్రియలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించారని, ప్రశ్నపత్రాల తయారీ నుంచి మార్కుల అప్‌లోడింగ్ వరకు ఒకే బృందం పని చేసిందని ఆరోపించారు.

ఎస్సీఆర్టీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు తొలుత కృష్ణా జిల్లా టాప్ ర్యాంక్ వచ్చిందని, మొదటి మెరిట్ లిస్ట్‌లో టాపర్‌గా ఉన్న అతని పేరును తర్వాత తొలగించి రెండో మెరిట్ లిస్ట్‌లో మరో అభ్యర్థిని టాపర్‌గా ప్రకటించారని పేర్ని నాని పేర్కొన్నారు. రెండు మెరిట్ లిస్టులు ఎందుకు విడుదల చేశారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ మెరిట్ లిస్టును కలెక్టరేట్‌లో ప్రదర్శించకుండా కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే ఎందుకు విడుదల చేశారని కూడా ఆయన ప్రశ్నించారు. నవీన్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక, డీఎస్సీ పేపర్ లీకేజీ ఆరోపణలపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని, నియామకాలపై బహిరంగ చర్చకు రావాలని పేర్ని నాని సవాల్ విసిరారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని పలుమార్లు చెప్పినా మంత్రి నారా లోకేష్ స్పందించడం లేదని విమర్శించారు.