NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ

Ntr Health University

Ntr Health University

NTR Health University: రాష్ట్రంలో వైద్య విద్య, ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీకి NAACలో మొదటి ర్యాంక్ రావడం గర్వకారణమని తెలిపారు. ఏపీలో ఫ్యామిలీ మెడిసిన్ అందుబాటులోకి వచ్చిందని, వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యేక వైద్య సేవలు మరింత అవసరమవుతున్నాయని చెప్పారు. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ కోర్సును కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

ఫ్యామిలీ మెడిసిన్‌లో పీజీ చేసిన వైద్యుల అవసరం రాష్ట్రంలో పెరుగుతోందని డాక్టర్ లోకేష్ తెలిపారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారి సంఖ్యకు, పీజీ సీట్లకు మధ్య చాలా గ్యాప్ ఉందన్నారు. మెడికల్ లెర్నింగ్‌లో మనం ఇంకా వెనుకబడి ఉన్నామని, హెల్త్‌కేర్‌ను మరింత మెరుగుపర్చాలంటే పీజీ సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి మెడికల్ కాలేజీ నుంచి రీసెర్చ్ పబ్లికేషన్స్, జర్నల్స్ వెలువడేలా ప్రోత్సహించాలని డాక్టర్ లోకేష్ సూచించారు. వైద్య విద్యలో పరిశోధనలకు ప్రాధాన్యం పెంచితేనే వైద్య రంగంలో మరింత నాణ్యమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్ పూర్తి
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్ మాట్లాడుతూ.. అన్ని కోటాల్లోని ఎంబీబీఎస్ మెడికల్ సీట్ల ప్రక్రియను సెప్టెంబర్ 2లోగా పూర్తి చేశామని తెలిపారు. నిన్న సాయంత్రానికి ఫేజ్-1 కౌన్సెలింగ్ కూడా పూర్తయిందన్నారు. ఆల్ ఇండియా కోటాలో సెప్టెంబర్ 19లోగా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. విద్యార్థులు ఎన్ని కాలేజీలను ఆప్షన్‌గా ఎంచుకోవాలన్నది వారి హక్కు అని డాక్టర్ సాయిసుధీర్ స్పష్టం చేశారు. కాలేజీల ఆప్షన్ల విషయంలో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వానికి వినతి చేశామని తెలిపారు. మెరిటోరియస్ రిజర్వేషన్ అభ్యర్థుల నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

జీవో 102పై ఆందోళన అవసరం లేదు
జీవో 102 విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారని డాక్టర్ సాయిసుధీర్ తెలిపారు. ఈ జీవో వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారి సంఖ్య 70 మంది ఉండే అవకాశం లేదని చెప్పారు. ఆప్షన్ల విషయంలో ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. కచ్చితంగా మెడికల్ సీటు పొందాలంటే విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ కాలేజీలను ఆప్షన్లుగా పెట్టుకోవాలని సూచించారు. కాలేజీల ఆప్షన్లకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వచ్చే వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. జీఓ 102పై స్టే ఇవ్వాలన్న అంశాన్ని కోర్టు అంగీకరించలేదని, దీనిపై తాము ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని తెలిపారు.