Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి

Lokesh

Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యమని, ఇందుకు మీ అందరి సహకారం కావాలని పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో పాన్-ఐఐటీ (PanIIT) కాన్ఫరెన్స్ టీమ్ తో జరిగిన డిన్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు.. సీఎం చంద్రబాబు గురించి అందరికీ తెలుసన్నారు లోకేష్.. ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఒక్కో వెర్షన్‌తో మరింత మెరుగుపడుతుంటాయని.. అలాగే.. మన ముఖ్యమంత్రి కూడా ప్రతి వెర్షన్‌తో మరింత మెరుగవుతున్నారన్నారు.. ఇది ఆయన నాలుగో వెర్షన్. ప్రజా ప్రభుత్వంలో 50 శాతం మంది శాసనసభ్యులు తొలిసారి ఎన్నికైనవారే. అలాగే 25 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. నేను ఇప్పుడు సీనియర్ మంత్రిని. రాష్ట్రాభివృద్ధి కోసం మేమంతా కసితో, పట్టుదలతో పనిచేస్తున్నాం అన్నారు లోకేష్..

ఇక, సీఎం చంద్రబాబు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అనంత్ అంబానీతో కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌, హార్టికల్చర్ మిషన్‌ను ప్రారంభించారన్నారు లోకేష్.. ఈ మిషన్ లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం కలిసి దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రపంచంలోనే ఉద్యానవన రంగంలో భారత్‌ను నెం.1 స్థానానికి తీసుకెళ్లడమే ఈ మిషన్ లక్ష్యం. ఏపీలో హార్టికల్చర్ నుంచి స్పేస్ వరకు, డ్రోన్ల నుంచి క్వాంటమ్ టెక్నాలజీ వరకు, డేటా సెంటర్ల వరకు ఎన్నో రంగాల్లో ముందుకు సాగుతున్నాం. ఏపీలో మనం నూతన చరిత్రను సృష్టిస్తున్నాం. అంతా కలిసి మన లక్ష్యాలను కార్యరూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

ఏపీ మీకు ఒక అద్భుతమైన వేదికను అందిస్తోందన్నారు.. ఇక్కడ కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో వాటికి ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించాలనుకుంటున్నామని.. పోటీతో కూడిన సమాఖ్య వ్యవస్థలో ఒక రాష్ట్రం ఒక మంచి పని చేస్తే, మిగతా రాష్ట్రాలు కూడా దానిని అనుసరిస్తాయన్నారు.. అందువల్ల ఏపీ మార్గదర్శకంగా నిలవగలదని విశ్వసిస్తున్నా అన్నారు లోకేష్.. యూరప్, అమెరికా అభివృద్ధి చెందిన దేశాలుగా మారడానికి 100 నుంచి 120 సంవత్సరాలు పట్టింది. దుబాయ్‌కు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు పట్టింది. సింగపూర్ కేవలం 25 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగింది. ఇక్కడ ఉన్న మేధోశక్తి, ప్రతిభ, సంకల్పం, సానుకూల నాయకత్వాన్ని గమనిస్తే.. భారత్‌ను కేవలం 10 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలమని నేను నమ్ముతున్నా. ఒక దశాబ్దంలోనే మనం అభివృద్ధి చెందిన దేశంగా మారగలం. ఒక రాష్ట్రంగా ఏపీ ఈ మార్పునకు నాయకత్వం వహించాలని భావిస్తోంది.