NTV Telugu Site icon

Kiran Kumar Reddy: వైఎస్‌ ఉన్నా రాష్ట్ర విభజన ఆగేది కాదు..! కిరణ్‌కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Kiran Kumar Reddy

Kiran Kumar Reddy

Kiran Kumar Reddy: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉండి ఉంటే.. అసలు ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగేది కాదని చాలా మంది చెబుతుంటారు.. కానీ, ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి.. విజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు.⁠ కానీ, రాజశేఖర్ రెడ్డి తోనే రాష్ట్ర విభజనకు అనుకూలం అనే తీర్మానాన్ని 2009లోనే కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీలో పెట్టించాలని చూసిందని పేర్కొన్నారు.. ⁠2014లో జరిగిన రాష్ట్ర విభజన 2009లోనే జరిగాల్సింది ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Massive Theft in Gold Shop: ఏలూరులో కలకలం.. సినిమాలను తలదన్నే రేంజిలో చోరీ..

ఈ సందర్భంగా అప్పటి విషయాలను గుర్తుచేసుకున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి.. నేను చీఫ్ విప్‌గా ఉన్నప్పుడు వైఎస్ పిలిచి ”మేం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం’ అనే తీర్మానం అసెంబ్లీలో పెట్టాలని చెప్పారు.. ఇదేంటి ఎన్నికలకు వెళ్లే ముందు ఇలా పెడితే మనం ఒడిపోతాం అని తాను రాజశేఖర్‌రెడ్డితో అన్నాను. కానీ, నా చేతుల్లో ఏం లేదు.. రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పారని వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి అన్నారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడి.. ‘మేం తెలంగాణకు అనుకూలం’ అనే తీర్మానాన్ని ‘మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు’ అని మార్చి పెట్టామని వెల్లడించారు. అయినా రాష్ట్ర విభజన జరగదని అనుకున్నాం. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. వైఎస్‌ ఉన్నా రాష్ట్ర విభజన ఆగేది కాదంటూ కొత్త చర్చకు తెరలేపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి..

Show comments