Vallabhaneni Vamsi Remand Report: గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ పడింది. దీంతో వంశీని పటిష్ట భద్రత మధ్య విజయవాడ సబ్ జైలుకు తరలించారు పోలీసులు. వంశీని హైదరాబాద్.. రాయదుర్గంలో నిన్న ఉదయం అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన విజయవాడకు తీసుకెళ్లిన ఏపీ పోలీసులు.. రాత్రి ACMM కోర్టులో హాజరుపర్చారు. వంశీతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఏ7 ఎలినేని వెంకట శివరామకృష్ణ, ఏ8 నిమ్మ లక్ష్మీపతిలకు కూడా కోర్టులో హాజరుపర్చారు. ప్రభుత్వం తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట 45 నిమిషాల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు జడ్జి. ఆ తర్వాత వంశీతో పాటు శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతిలకు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వంశీ అరెస్ట్‌పై వాదనలు ఇవాళ్టికి వాయిదా పడ్డాయి.
Read Also: PM Modi: అక్రమ వలసదారులకు మోడీ షాక్.. వారికి ఆ హక్కు లేదని ప్రకటన..
అయితే, వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. సత్యవర్ధన్‌ను బెదిరించడంలో వంశీదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని గుర్తించినట్లు ప్రస్తావించారు. వంశీకి చట్టాలపై గౌరవం లేదని, అతనికి నేర చరిత్ర ఉందని, ఇప్పటి వరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. వంశీని పట్టుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా సీపీ ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడ తీసుకొచ్చామని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఈ కేసులో ఏ9గా ఉన్న పొట్టి రాము తనను కలవాలని వంశీ బలవంతం చేశారని, సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారని అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Read Also: Rajat Patidar RCB: మూడేళ్ల ముందు అమ్ముడే పోలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్!
సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపు, దాడి కేసులో వంశీతో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు పోలీసులు. ఏ1గా ఉన్న వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేస్తే, ఏ7 ఎలినేని శివరామకృష్ణ, ఏ8 నిమ్మ లక్ష్మీపతిని విజయవాడలో అరెస్టు చేశారు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో సత్యవర్దన్ వాగ్మూలం నమోదు చేశారు. వంశీని విజయవాడ.. కృష్ణ లంక పోలీస్‌ష్టేషన్‌లో 8 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. ఇంటరాగేషన్ ముగిశాక వంశీతో పాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షలు ముగిశాక రాత్రి 10 గంటలకు కోర్టుకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. రిమాండ్ విధించడంతో వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినప్పటి నుంచి విజయవాడ సబ్ జైలు వరకు పటిష్టభద్రత మధ్య వంశీని తరలించారు పోలీసులు. సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో మిగతా నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ కేసులో కీలకమైన సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.