Kanaka Durga Temple: పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు.. నేడు దుర్గమ్మ జలవిహారం

Kanaka Durga

Kanaka Durga

Kanaka Durga Temple: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. భక్తులు ‘జై దుర్గా.. జై జై దుర్గా’ అంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

అమ్మవారి దర్శనానికి రానున్న గవర్నర్
రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం గవర్నర్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కనకదుర్గ నగర్‌లో ఉత్సవమూర్తుల ఊరేగింపు
దసరా మహోత్సవాల ముగింపు సందర్భంగా సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కనకదుర్గ నగర్ పురవీధుల్లో గంగ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను ఊరేగించనున్నారు. ఈ ఊరేగింపు అనంతరం సాయంత్రం 6 గంటలకు హంస వాహనంపై స్వామివార్ల జలవిహారం నిర్వహించనున్నారు.

దుర్గాఘాట్‌లో జలహారతి
హంస వాహనంపై జరిగే జలవిహారం సమయంలో దుర్గాఘాట్‌లో జలహారతి సమర్పించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం గంగ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను అమ్మవారి పుట్టిల్లుగా భావించే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు.

వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జమ్మి కొట్టుట
నేలతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివార్ల ఉత్సవమూర్తులను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లనున్నారు. అక్కడ సంప్రదాయం ప్రకారం జమ్మి కొట్టుట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన అనంతరం మరుసటి రోజు ఉదయం గంగ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులు తిరిగి ఆలయానికి చేరుకోనున్నాయి. దీంతో ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా పూర్తికానున్నాయి. చివరి రోజు అమ్మవారి దర్శనం, జలవిహారం, జలహారతి, జమ్మి కొట్టుట కార్యక్రమాలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.