Site icon NTV Telugu

Durga Devi as Saraswati: సరస్వతి దేవి అవతారంలో దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు..

Kanaka Durga

Kanaka Durga

Durga Devi as Saraswati: శ్రీ పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ ప్రత్యేక అలంకరణను తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులతో దుర్గగుడి ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో నిలుస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 18 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. వేలాది మంది భక్తులు ఇప్పటికే ఆలయానికి చేరుకోగా, మరింత మంది రానున్నారని అంచనా వేస్తున్నారు.

Read Also: T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు ముందు.. భారత్, ఆస్ట్రేలియాలో ఆడటానికి నిరాకరించిన జట్లు ఇవే

శ్రీ పంచమి సందర్భంగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది పిల్లలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అక్షరాభ్యాసాన్ని సామూహికంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించామని తెలిపారు. అక్షరాభ్యాసంలో పాల్గొనే పిల్లలకు పలక, పెన్ను, కంకణం, కుంకుమతో పాటు లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేస్తున్నారు. విద్య, విజ్ఞానానికి అధిష్ఠాత్రి అయిన సరస్వతి దేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల విద్యార్థులకు శుభఫలితాలు కలుగుతాయనే విశ్వాసంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పిల్లలను తీసుకువస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు అధికారులు తెలిపారు. క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా పోలీసులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారు.

Exit mobile version