Budameru Floods: విజయవాడ నగరవాసులను మరోసారి బుడమేరు వరద టెన్షన్ పెడుతుంది.. గత ఏడాది ఇదే సమయంలో నగరాన్ని ముంచెత్తింది బుడమేరు వరద.. భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.. అదో పీడకలగా మారిపోయింది.. అయితే, రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల పొంగి ప్రవహిస్తోంది బుడమేరు.. గుణదల ఒకటవ డివిజన్ లోని వంతెనపై నుంచి బుడమేరు ప్రవహిస్తోంది.. దీంతో, వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. అయితే, వరద ఉధృతి పెరిగితే బుడమేరు అంచున ఉన్న ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉంది.. మరోవైపు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరద ఉధృతి పెరిగితే గత ఏడాది పరిస్థితులు పునరావృతం అవుతాయని బుడమేరు పరివాహ ప్రాంతాల ప్రజల్లో ఆందోళన మొదలైంది.. వరద నీటితో పాటు పాములు, తేళ్లు, విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇక, బుడమేరు ప్రవాహానికి అడ్డుగా ఉన్న తూటుకాడను వీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.. మరోసారి గత ఏడాది పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు..
Read Also: Donald Trump: పుతిన్ కాస్కో.. యుద్ధం ఆగకపోతే దబిడి దిబిడే.. ట్రంప్ హెచ్చరిక
మరోవైపు, మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం కొండపల్లి శాంతి నగర్ వద్ద బుడమేరు వరద పరిస్థితిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు.. బుడమేరు గండ్లు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో గండి పడి విజయవాడ మునిగిన నేపథ్యంలో.. అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు.. ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద వచ్చే వరద నీటిని బట్టి ఇతర బ్రాంచ్ కాల్వలకు నీరు మల్లించాలని, దిగువకు సామర్థ్యం మించి విడుదల చేయొద్దని సూచించారు.. ఇక, బుడమేరు వల్ల ఎటువంటి ప్రమాదం రాదని.. విజయవాడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని, సోషల్ మీడియాలో వచ్చే అనవసర సమాచారం సమ్మొద్దని ప్రజలకు సూచించారు అధికారులు..
