AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూడటంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ సమయంలో జరిగిన ఘటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ సమావేశంలో సమీక్షించినట్లు సమాచారం.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఎన్నికల విధుల్లో ఉన్న పలువురు ఎస్పీలు, డీఎస్పీల పనితీరుపైనా సమీక్ష కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడటం, విధులను సమర్థంగా నిర్వహించడం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై అధికారుల పనితీరును పరిశీలిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో వ్యవహరిస్తూ, ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా చూడటంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది.

