AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతూనే ఉంది.. ఇక, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల ఫేజ్-II నామినేషన్ల పరిశీలనను పూర్తి చేసింది. మరోవైపు ఫేజ్-III ఎన్నికలకు సంబంధించి తొలిరోజు దాఖలైన నామినేషన్ల వివరాలను కూడా వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పరిధిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.
ఫేజ్-II నామినేషన్ల పరిశీలన పూర్తి
ఫేజ్-IIలో రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల పరిధిలోని 52 రెవెన్యూ డివిజన్లు, 246 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 4,975 సర్పంచ్ స్థానాలకు, 49,318 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం సర్పంచ్ పదవులకు 25,413 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వార్డు సభ్యుల పదవులకు 1,09,178 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి.
జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 388 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 1,946 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతి జిల్లాలో 373 స్థానాలకు 1,767 నామినేషన్లు వచ్చాయి. మరోవైపు విశాఖపట్నం జిల్లాలో ఫేజ్-II కింద ఒక్క గ్రామ పంచాయతీకి కూడా ఎన్నికలు జరగడం లేదు. అల్లూరి సీతారామరాజు, గుంటూరు జిల్లాల్లో అత్యల్పంగా 87 చొప్పున సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్లు, 10 మండలాల పరిధిలో 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు 769 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 1,806 వార్డు సభ్యుల స్థానాలకు 4,797 నామినేషన్లు వచ్చాయి.
ఫేజ్-III ఎన్నికలకు తొలిరోజే భారీగా నామినేషన్లు
ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల ఫేజ్-III నామినేషన్ల ప్రక్రియలోనూ అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభించింది. రాష్ట్రంలోని 28 జిల్లాల జాబితాలో 25 జిల్లాల్లో మాత్రమే ఫేజ్-III ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలవరం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తిరుపతి జిల్లాల్లో ఈ దశలో ఎన్నికలు లేవు. మొత్తం 46 రెవెన్యూ డివిజన్లు, 214 మండలాల్లోని 4,244 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే సర్పంచ్ పదవులకు 4,930 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 13,615 నామినేషన్లు దాఖలయ్యాయి. ఫేజ్-IIIలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 325 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 267, విజయనగరం జిల్లాలో 244, కడప జిల్లాలో 235 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవులకు అత్యధిక నామినేషన్లు దాఖలైన జిల్లాల్లో కడప 465 నామినేషన్లతో మొదటి స్థానంలో నిలిచింది. శ్రీకాకుళంలో 455, మార్కాపురంలో 366, చిత్తూరులో 318 నామినేషన్లు వచ్చాయి. మరోవైపు ఎన్.టి.ఆర్ జిల్లాలో అత్యల్పంగా 48 సర్పంచ్ నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. వార్డు సభ్యుల పదవులకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 1,398 నామినేషన్లు వచ్చాయి. కడప జిల్లాలో 1,120, కాకినాడలో 916, విజయనగరంలో 850 నామినేషన్లు దాఖలయ్యాయి.

