AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తుది దశ నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు..!

Ap Panchayat Elections Fina

Ap Panchayat Elections Fina

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు తుది దశ చేరుకుంటున్నాయి.. ఇప్పటికే రెండు దశలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కాగా.. తొలి దశలో విత్‌డ్రాలు కూడా ముగిసిన తుది జాబితా ప్రకటించారు.. రెండో దశలో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది.. ఇక, తుది దశకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. ఎల్లుండి నుంచి తుది దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు కల్పించారు.

ఈ నెల 24వ తేదీన ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) నిర్వహించనున్నారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యంతరాలు, అప్పీళ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను ఈ నెల 26వ తేదీన పరిష్కరించనున్నారు. అనంతరం అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

ఇక డిసెంబర్ 2వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఏదైనా కారణంతో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడితే డిసెంబర్ 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల తుది దశకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించనున్నారు..