AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం కార్పొరేషన్ (APSBCL) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. మద్యం కుంభకోణం కేసులో ఏ2గా ఉన్న ఆయనపై సిట్ (SIT) అధికారులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో అనేక విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.. సిట్ విచారణలో సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్, ఎఫ్ఎస్‌ఎల్ (FSL) నివేదికలు మరియు సాక్షుల వాంగ్మూలం ప్రకారం.. ఈ మొత్తం స్కామ్‌లో వాసుదేవరెడ్డిది అత్యంత కీలక పాత్ర అని తేలింది. మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, ఆర్డర్లు మరియు సరఫరా మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగాయని సిట్ స్పష్టం చేసింది.
* రిమాండ్ రిపోర్టులోని ముఖ్యాంశాలు
ఆన్‌లైన్ వ్యవస్థ నిర్వీర్యం: ఏపీఎస్‌బీసీఎల్ కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లో ఉండాల్సి ఉండగా, ఎటువంటి అనుమతులు లేకుండానే కావాలని వాటిని మ్యాన్యువల్ (Manual) పద్ధతిలోకి మార్చారు. తద్వారా అక్రమాలకు తెరలేపారు.
సిండికేట్ పాలన: ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి, అతని అనుచరులు సుమిత్, ప్రకాష్‌లతో కలిసి వాసుదేవరెడ్డి ఒక సిండికేట్‌గా ఏర్పడ్డారు. వీరి ద్వారానే సెటిల్మెంట్లు, లిక్కర్ ఆర్డర్ల నిర్వహణ సాగింది.
కంపెనీల బెదిరింపులు: నచ్చిన బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వడం, నచ్చని వాటిని నిలుపుదల చేయడం ద్వారా లిక్కర్ కంపెనీల యజమానులను బెదిరించారు. పర్సంటేజీల రూపంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు.
ఖజానాకు భారీ నష్టం: వాసుదేవరెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 192 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాకుండా, ప్రతి నెలా సుమారు రూ. 60 కోట్ల వరకు నిధులను దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.
గోప్యతకు తిలోదకాలు: పబ్లిక్ సర్వెంట్‌గా ఉండి లిక్కర్ సేల్స్, ఆర్డర్స్ వంటి అత్యంత సున్నితమైన ప్రభుత్వ సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు చేరవేశారు.
క్రిమినల్ నేరాలకు ప్రేరణ
రాజకీయ పెద్దల అండతో వ్యవస్థ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న వాసుదేవరెడ్డి, నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ మద్యం స్కామ్ ఎలా చేయాలనే దానిపై వ్యూహరచన చేసేవారని రిపోర్టులో పేర్కొన్నారు. విధులను దుర్వినియోగం చేస్తూ క్రిమినల్ నేరాలకు పాల్పడ్డారని సిట్ తేల్చింది.
