Minister Narayana: విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో స్వర్ణాంధ్ర 2047 సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి మురికివాడల రహిత నగరంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. విజన్ 2047లో 10 సూత్రాల అమలుతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందించాలనేది సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. దేశం వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే నాటికి రాష్ట్రాన్ని సమగ్రమైన, సమతుల్యమైన అభివృద్ధి నమూనాగా రూపొందిస్తాం.. వికసిత్ భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు విజన్ 2047ను రూపొందించారని మంత్రి పొంగూరు నారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: YS Jagan: కొడాలి నానిని పరామర్శించిన వైఎస్ జగన్..
ఇక, విజన్ 2047లో కీలక అంశంగా అమరావతి కూడా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి కేవలం మౌళిక వసతుల ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. నాణ్యమైన జీవన ప్రమాణాలు ఉండేలా డిజైన్ చేశాం.. పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో అర్బన్ డెవలప్మెంట్ కేటాయించడం ఎంతో ముఖ్యమైన అంశం.. కేంద్ర నిధులతో రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆర్థిక వనరుల వినియోగం ద్వారా పట్టణాల అభివృద్ధికి ప్లానర్లు, ఆర్కిటెక్ట్ లు సహకారం అందించాలని నారాయణ కోరారు.