AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!

Ab Venkateswara Rao

Ab Venkateswara Rao

AB Venkateswara Rao: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి అందరు అభ్యర్థులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు.. ఇక, జనసేన అభ్యర్థిగా బెజవాడ మేయర్‌ బరిలోకి దిగిన వంగవీటి రాధాపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, విజయవాడ మేయర్ స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా తనకు 20 ఏళ్లుగా పరిచయమని తెలిపారు. రాధా తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో తాను విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేశానని గుర్తుచేశారు. ఆ తర్వాత తాను ఎక్కడికి వెళ్లినా రాధాతో పరిచయం కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో తాను వంగవీటి రాధా గురించి ఒక్క పరుషమైన మాట కూడా మాట్లాడనని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. రాధా కూడా తన గురించి పరుషంగా మాట్లాడరని అన్నారు. తమ మధ్య ఉన్నది రాజకీయ సమరమే తప్ప వ్యక్తిగత పోరాటం కాదని వివరించారు. కొందరు కావాలనే తమ మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెంత రెచ్చగొట్టినా తాము రెచ్చిపోయే వాళ్లం కాదని స్పష్టం చేశారు.

విజయవాడ నగర మేయర్ విషయంలో నగర ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడ వంటి నగరానికి నాయకత్వం వహించే అవకాశం రాకపోయినా, మేయర్ పదవికి పోటీ చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తాము డీజే కూడా లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని, నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కొద్ది రోజుల సమయం మాత్రమే ఇచ్చిందని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నిర్ణయం ఏమీ లేదని, అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే జరుగుతోందని వ్యాఖ్యానించారు.