Nipah Virus: కేరళలో తగ్గుముఖం పట్టిన నిఫా కేసులు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. తాజాగా బెంగాల్ లో కూడా దీని అలికిడి ప్రారంభమైంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో ఈ వైరస్ ముప్పు పొంచి ఉందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు. మరోవైపు నిఫా వైరస్ కరోనా కంటే ప్రమాదకరమని ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహించిన అధ్యయనంలో చెప్పారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ గబ్బిలాల వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కేరళలో ఈ వైరస్ తో ఇద్దరు మృతి చెందగా.. నలుగురు చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది.
Read Also: Bigg Boss Telugu 7: పవర్ అస్త్ర కోసం.. రవితేజ లుక్ ను వదులుకున్న అమర్..?
విజయవాడలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో నిఫా వైరస్ పేషెంట్లకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు జీజీహెచ్ అధికారులు. కోవిడ్ కంట్రోల్ కు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అంతకంటే పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 21 మందికి వెంటనే ట్రీట్మెంట్ అందించేలా ఏర్పాటు చేశారు. ఆక్సిజన్, మానిరింగ్ సిస్టం, 24 గంటలు ప్రత్యేక డాక్టర్లు, ఒక సూపర్వైజర్, ప్రత్యేక పరీక్షా విధానాల సదుపాయాలు కల్పించారు. ఎటువంటి మెడిసిన్ కావాలన్నా వెంటనే అందుబాటులో ఉంచేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. జ్వరం వచ్చి తగ్గకపోయినా.. విపరీతమైన ఆయాసం, మర్చిపోవడం, మెదడు సంబంధిత లోపాలు కనిపించినా అది నిఫా వైరస్ ప్రభావమే అని వైద్యులు చెబుతున్నారు. జ్వరం వచ్చినపుడు పారాసిటమాల్ మాత్రమే వేయాలని.. తగ్గకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలని.. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలతో అక్కడి వైద్యులు ఏర్పాటు చేశారు.