ఏపీలోని విజయవాడలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఛలో విజయవాడ పేరుతో అనేక ప్రాంతాల నుంచి ఉద్యోగులు తరలివచ్చి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలపై ఆందోళన నిర్వహించారు. అయితే ఈ ఆందోళనలో బెజవాడ ఆడపడుచులు తమ వంతు సహకారం అందించారు. భారీ స్థాయిలో తరలివచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ మంచినీటి బిందెలు ఏర్పాటు చేసి ఉద్యోగుల దాహర్తి తీర్చారు. ఈ సందర్భంగా తమ ఆందోళనల పట్ల విజయవాడ మహిళలు చూపించిన సహకారం మరిచిపోలేనిది అంటూ పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
Read Also: ఉద్యోగుల ఆందోళన బల ప్రదర్శన వంటిదే-సజ్జల
అటు ఉద్యోగుల ఉద్యమానికి ప్రజల మద్దతు లేదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. ప్రజల మద్దతు లేదంటూ సకలశాఖల మంత్రి సజ్జల చేస్తున్న ప్రకటనల పట్ల.. దారి పొడవునా ఉద్యోగులకు నీళ్లు అందిస్తూ దాహార్తి తీర్చి బెజవాడ ఆడపడుచులు చక్కటి సమాధానమిచ్చారని కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికైనా సీఎం జగన్ కళ్లు తెరిచి ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని సోమిరెడ్డి హితవు పలికారు.
